వసంతానికి స్వాగతం

కల్లలైన కలల మధ్య
చేదు జ్ఞాపకాలలోని తీపి స్మృతుల మధ్య
అలనల్లన నడిచొచ్చే ఉగాదికి స్వాగతం

వేపపూత,మావిచిగురు పచ్చదనాల మధ్య
కోకిల గీతాల కలకలం మధ్య
కోటికలల తీపి గొంతుకలతో స్వాగతం

ఒక్కో వసంతం ఎన్ని తీపికలలను వెంట తీసికొస్తుందో
ఒక్కో వసంతం ఎన్ని వాడిన జీవితాల కధలను వెంటకొనిపోయిందో

పిల్లాడి స్కూల్ ఫీజుల కోసం
కాఫీ కప్పులో పంచదార కోసం
ఇంటి కొచ్చిన కొత్తల్లుడి గొంతెమ్మ కోర్కెలు తీర్చడం కోసం
మా ఆత్మాభిమానాన్ని చంపుకుంటున్నా
వసంతానికి ఆహ్వానం చెబుతుంటాం
నింగినంటుతున్న ఉల్లి కన్నీటిజల్లై కురుస్తున్నా
హైటెక్ టాక్స్ ల ఇంద్రజాలంలో ఊపిరాడక చస్తున్నా
ప్రత్తిచేలో రొజుకో మట్టి సూరీడు అస్తమిస్తున్నా
ప్రతిదినం హవాలా నామస్మరణంతో
మా నైతిక విలువల దిగజారుడుతనాన్ని ప్రశ్నిచుకుంటున్నా
వసంతాన్ని ఆహ్వానించడం మానం
ప్రతి వసంతానికింత నమ్మకాన్ని కూర్చుకోడం మానం

మాలో మేము కుంచించుకుపోతున్నా
మమ్ము మేము వంచిచుకుంటున్నా
పెరటి వేపచెట్టును వేరేవాడెవడో దోచుకుపోతున్నా
వసంతాన్ని ఆహ్వానించడం మానం

మా కలల ఖరీదు చందమామలోకి తొంగిచూడడం
మా ఆశల విలువ నక్షత్రాల బరువు
మా బ్రతుకు తంత్రులు తెగిపోతున్నా
రేపటి రాగాలు పలికించడం తెలుసు
మా ఆశలు పూస్తున్నంత కాలం
ఉగాదీ! నీకు స్వాగతం చెబ్తుంటాం

--- మల్లవరపు ప్రభాకరరావు(1996)

Comments

Popular posts from this blog

అజాత శత్రువు

మధురకవి మల్లవరపు జాన్ గారి పై సాహీతీ కౌముది ప్రత్యేక సంచిక