పరిమళించే 'జాతీ'యత !

కవిత్వమంతా జాతీయతను పరిమళింప చేసే కొద్దిమంది పద్య కవులలో 'మధురకవి' మల్లవరపు జాన్ కవి గారు ఒకరు! ఆయన మరణానంతరం వెలువడుతున్నదీ"స్వగతము". దీనిలోని ఇతివృత్తం జన్మరీత్యా ఒక మాదిగవాని స్వగతం. ఇంకా లోతుగా చెప్పాలంటే కులం వల్ల జీవితమంతా అవమానాల పాలై తన అస్తిత్వానికై తపన పడిన ఓ దళితుని స్వగతం దీనిలో వినిపిస్తుంది. మాదిగ జీవితం చుట్టూ ఆ వర్ణన కొనసాగినా రకరకాల జీవితానుభావాలను ఎదుర్కొంటున్న ప్రతి దళితుని ఆవేదనను ఈ "స్వగతం"లో అక్షరీకరించగలిగారు.
ఈ "స్వగతము"ను ఏ ప్రక్రియగా చెప్పుకొనే వీలుందనుకొంటూ చదివాను. మన లాక్షణికులు "ఖండకావ్యం, ఆఖ్యానం, ఆఖ్యాయిక వంటి వాటికి సమానమైన పోలికలున్న కొన్ని లక్షణాలను చెప్పారు. "ఖండకావ్యం భవేత్కావ్యస్యైకాదేశనుసారిచ" అని 'సాహిత్య దర్పణం' ఖండకావ్యం అంటే ఏమిటో వివరిస్తుంది. కవి తాను స్వయంగా చూసిన దాన్ని చెబితే (స్వయం దృష్టార్థ కథనం ప్రాహురాఖ్యానం బుథా) దాన్ని 'ఆఖ్యానం' అని అంటారు. 'కల్పితేతివృత్తం కలిగినదాన్ని కథ' అని 'సత్యేతివృత్తాంతం కలదాన్ని ఆఖ్యాయిక (కథ కల్పిత వృత్తాంతా సత్యార్థాఖ్యాయికా మతా) అని లక్షణాలు వివరిస్తున్నాయి. కావ్య నాయకుడే స్వయంగా ఆ రచనలో తన వృత్తాంతాన్ని తెలిపినట్లయితే దాన్ని ఆఖ్యాయిక (వృత్తమాఖ్యాయతే యస్యాం నాయకేన స్వచేష్టితం) అంటారని లాక్షణికులు అంటున్నారు. అయితే, మల్లవరపు జాన్ కవి గారు రాసిన "స్వగతము"లో గేయ లక్షణాలున్నప్పటికీ అంతకుమించి ఒక అంశాన్ని హృద్యంగా వర్ణించే లక్ష్యమే ప్రధానంగా కనిపిస్తుంది.దళితుని జీవితంలో కులం కేంద్రంగా జరిగే అకృత్యాలను ఏకదేశంగా వర్ణించగలిగారు కవి. అలా వర్ణించటంలో బిగువు కూడా ఖండకావ్యానికే బాగా ఒదుగుతుంది. అది ఈ 'స్వగతం'లో ఉంది.అలా గేయంలో కూడా ఖండకావ్యం రాయవచ్చనని నిరూపించారు. ఈ రచనలో కవి తన కథనే చెబుతున్నట్లు అనుకుంటే, దీన్ని ఆఖ్యానం అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ, కవి తన విషయాలు కాకుండా తను ఒక జాతికంతటికీ ప్రతినిధిగా వివరించారు. కనుక, ఆఖ్యానం అయ్యే అవకాశం లేదు. పోనీ సత్యార్థ కథమే ప్రధానం అనుకుందామంటే "స్వగతం" నిండా జీవిత వాస్తవికతే ఎక్కువగా కనిపిస్తుంది. అంతకు మించి ఒక జాతి జీవితం చుట్టూ ఉన్న జీవన వ్యథంతా కనిపిస్తుంది. ఇవన్నీ ఖండకావ్యాల్లో కనిపించే కొన్ని లక్షణాలు. కనుక, దీన్ని 'ఖండకావ్యం' అని పిలవడం సమంజసమేమో!
కొన్ని వందల సంవత్సరాలుగా తెలుగువారికి వారసత్వ సంపదగా కొనసాగుతున్న ఛందోబద్ద కవిత్వంలో మాత్రాఛందస్సు కూడా ఒక భాగమే! గురజాడ అప్పారావు గారి 'ముత్యాల సరాల' లో సంస్కరణ భావాలు కనిపిస్తాయి. మల్లవరపు జాన్ కవిగారు కూడా ఈ ఖండకావ్యాన్ని మాత్రా ఛందస్సులోనే వర్ణించారు. సంప్రదాయంలో ఉంటూనే నవీనత్వాన్నీ కోరుకోవడానికి ఈ 'నవ్యసంప్రదాయ కవి' మాత్రా ఛందస్సుని ఒక మార్గంగా ఎంచుకున్నారు. ఆ మాట కొస్తే ఆయన ప్రతి రచనలోనూ సంప్రదాయంలో నవ్యత్వాన్ని కోరుకోవడం కనిపిస్తుంది.
జాతీయోద్యమ కాలంలో గాంధీజీ కులనిర్మూలనను కూడా ఒక అంశంగా చేర్చారు. తొలితరం దళిత కవులలో ముఖ్యంగా కుసుమ ధర్మన, గుర్రం జాషువ, బోయి భీమన్న మొదలైన కవులలో ఆ ప్రభావం ఎక్కువగానే కనిపిస్తుంది. అలాంటి ప్రభావమే మల్లవరపు జాన్ కవి గారి కవిత్వంలోనూ ఉంది. ఆ ప్రభావాన్ని ఆయన రాసిన ఇతర రచనలలో కూడా చూడవచ్చు. ఈ ఖండ కావ్యంలో ఆ ప్రభావాన్ని వర్ణిస్తూ........
" అంటరాని తనంబు పోవలే
అందరొకటై మెలగవలెనని
స్వరాజంబు తెచ్చుకోవలె"నని సంస్కరణ వాదులు భావించారంటారు కవి. అలా దళితులందరిని కలుపుకొని జాతీయోద్యమాన్ని విజయవంతంగా నిర్వహించి, స్వాతంత్ర్యాన్ని సాధించడానికి నాయకులు బాటలు వేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా కులనిర్మూలన మాత్రం జరగలేదు. దళితులకు అందవలసిన విద్యా సౌకర్యాలను అందనివ్వకుండా అడ్డుకున్నారు. అంతేకాదు చాలామంది, విద్యాలయాలకు వచ్చే దళితులను అస్పృశ్యులని అవమానించారు. అయినప్పటికీ విద్యాసక్తి గల దళితులు ఆ అవమానాలను సహిస్తూనే అక్షరాలు నేర్చుకున్నారు. అలా నేర్చుకోవడం వెనుక ఎంతో దయనీయ స్థితి ఉందంటూ కవి .....
"అంటరానితనంబు చనెనని
అయ్య నను బడికంపినప్పుడు
కండ్లురిమి నాపై రూళ్ళ" కర్రలను విసిరేవారని ఆ చారిత్రక పరిణామక్రమాన్ని వివరించారు. అంతే కాకుండా జానపద గేయాలు, బుర్రకథలు, హరికథలను వినడం ద్వారా మౌఖికంగానే విద్యనభ్యసించిన అనేక మంది దళితుల విద్యాభ్యాస విధానాన్ని, దాని వెనుకున్న వేదనామయ జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణించారు కవి.
మొత్తం మీద ఈ ఖండకావ్యంలో దళితుని జీవితాన్ని వర్ణించడానికి మాదిగ సాంస్కృతిక జీవనాన్ని కేంద్రంగా చేసుకున్నారు. దళితుని వేదన, పనిలో నైపుణ్యం, దళితుల పట్ల సంస్కరణ రూపంలో జరిగే మోసం, దాన్ని ఎదుర్కోవడానికి కొంతమంది దళితులు ప్రదర్శించే ఆగ్రహావేశాలు, అలాంటప్పుడే మరికొంత మంది దళితులు ప్రదర్శించే సంయమనం, ఆ సంయమనానికి సామాజిక సంబంధాలను, పురాణేతిహాసాలను హేతు పూర్వకంగా చూపడం, దళితులు కూడా పాలకులుగా ఉన్న చారిత్రక వారసత్వాన్ని విశదీకరించడం వంటివన్నీ 'కొండ అద్దమందు కొంచమై ఉండదా' అన్నట్లు వర్ణించగలిగారు. ప్రజాస్వామిక, లౌకిక మానవతావాదాన్ని స్థాపించే జాతీయతా స్ఫూర్తి ఈ రచన నిండా కనిపిస్తుంది. దీన్నంతటిని కవి ఒక భారతీయ పౌరుడిగా తన జన్మభూమిపై ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో నిలబడి మాట్లాడే ఒక దళితుని స్వరంగా వినిపించారు.
దేశీయతను, సంప్రదాయ వారసత్వాన్ని కొనసాగిస్తూనే అవాంచనీయ ధోరణులను సంస్కరించుకొనే నవ్యసంప్రదాయవాదకవిగా మల్లవరపు జాన్ కవిగారిని ప్రతిష్టాపించే ఖండకావ్యమిది. వస్తు ఛందో నవ్యతను ప్రదర్శించే ఈ కావ్యాన్ని పాఠక లోకానికి అందిస్తున్న ప్రచురణకర్తలు అభినందనీయులు.

- డా// దార్ల వెంకటేశ్వర రావు

Comments

Popular posts from this blog

అజాత శత్రువు

మధురకవి మల్లవరపు జాన్ గారి పై సాహీతీ కౌముది ప్రత్యేక సంచిక