ఆవాహన

నా ఆగిపోని స్వప్నాల్ని
నాలో ఆరని మోహాన్ని
ఇదిగో ఇలా నీ క్రీగంటి చూపులో పారేసుకుని
దివారాత్రాలు వెతకడం

ఒకానొక పూర్తికాని పద్యపు వెలితితో
హృదయాన్ని గుచ్చినట్లు నీ నవ్వీనవ్వని నవ్వు
స్వప్న వాసవదత్తల మృగనయని మోహాల
లోపల గిజ గిజ కొట్టుకుంటూ
నాలో సడలే నిస్సంకోచాల వ్యాకోచాల
నిర్మోహమాటాల రహస్య ద్వారాల గుండా
సావిరహే శాకుంతలా సౌరభాల
పుష్పించని బృందావన చీకటి వెతుకులాటలు

రెప్ప వేయని కాలాన్ని స్వప్నిస్తూ
గ్రాంఫోన్ గీతగోవిందాలు
మడొన్నా దేహ విన్యాసాలు
నిన్నటి క్లియోపాత్ర పిరమిడ్ ల
అంతరంగ రహస్య ఆనవాళ్ళు
దిశమొలతో ఆలింగనం

కనిపించని దూరాన్ని కొలుస్తున్న క్షతగాత్రుడి
ఎడారి గీతాల ఎడద నిండా
పగిలిన గాజు శకలాల జ్ఞాపకాల
ప్రాచీన ఏకాంత విహార యుద్ధాల ఆముష్మిక జీవన హేల
--- మల్లవరపు ప్రభాకరరావు(2006)

Comments

Popular posts from this blog

అజాత శత్రువు

మధురకవి మల్లవరపు జాన్ గారి పై సాహీతీ కౌముది ప్రత్యేక సంచిక