సెల్యూట్

ఈ రాత్రి కొన్ని కోట్ల స్వప్నాలను
చెదిరిపోకుండా ఓ కన్ను పహరా కాస్తుంది
తలుపులన్నీ బిడాయించుకుని
తలపులకు బార్లాతీసే అనేకానేకమంది స్వగతాల్లోకి
దూరం గా మసలుతూ
చలిని కప్పుకుంటూ చెలిని తలచుకుంటూ
తుపాకీని ఆలింగనం చేసుకునే హృదయమొకటి
హిమాలయాలంత ఎత్తులో పహారా కాస్తుంది

ఎన్నో రాత్రుల స్వప్నాలను, అనుభూతులను
లోపల్లోపలికి కుక్కేసి
దూరంగా వినబడే కవాతుల మధ్య
బంకర్ల మాటున దాగుతూ
ఒక్క క్షణంలో తుపాకీని గురి చూసే కన్నొకటి పహారా కాస్తుంది

యుద్ధం సరిహద్దుల్లోనే…
సరిహద్దుల్లోని సైనికుల్లోనే
కాషన్ తీసుకునే ప్రతిసారీ మెరిసే దూరపు ఆశల నునుపైన మెరుపు
గోదావరి వాగుల్లానో,కోనసీమ కొబ్బరాకుల్లానో
పాలకొండల పిలుపులానో
ఇంటి మొగదాల వేపచెట్టు పలకరింపులానో
మెరుపులు…
నాన్నెప్పుడొస్తాడని అడిగే చిన్నారి ప్రశ్నలు
అన్నీ ఆశలే…
బ్రతకడానికైనా,శత్రువుని గురిపెట్టడానికైనా అంతా ఆశే
జీవితాన్ని కోల్పోతూనో,గెలుస్తూనో -
జీతాన్నందుకున్న అమ్మ కళ్ళ మెరుపు కనిపించని దూరం
చెట్టంత అండను తనకొక్కదానికే స్వంతం చేసుకోని గర్వపు క్షణాలు
ఇవేవీ స్వగతాలుగా మార్చుకోకుండా
కర్తవ్యం మాటున దాచేసి “మా తుఝే సలాం” అంటూ
కదం తొక్కాల్సిందే
అంతర్గత సంక్షోభాలు అలముకున్నా
ఆకలి దాడులు జరుగుతున్నా
మంచుకొండల మధ్య ప్రతి అడుగూ విజయం వైపే
యుద్ధమూ జీవితమూ ఒకటే అయినచోట వేసే ప్రతి అడుగూ ఆశాపధం వైపే

రూపాయిలు,రాయితీలు ఆకలిని తీరుస్తాయేమోగాని
అనుభూతుల్ని అందివ్వలేవుగా
మన కాపలాదారు
మన జీవిత భరోసా
మన సరిహద్దు సిపాయికి చేతులెత్తి మొక్కాల్సిందే

--- మల్లవరపు ప్రభాకరరావు(2003)

Comments

Popular posts from this blog

అజాత శత్రువు

మధురకవి మల్లవరపు జాన్ గారి పై సాహీతీ కౌముది ప్రత్యేక సంచిక