దళితుల విజయగాధలు 'దళిత్ డైరీస్'

 

నాగప్పగారి సుందర్రాజు తన
'చండాల చాటింపు' కవితా సంపుటిలో ఒక కవితలో "ఇకనుంచి నా పాట నేనే పాడుకుంటా" అంటాడు. అవును. ఎవరూ పాడని తన జీవితాన్ని తనే ప్రకటించుకోవాలనే ఒక కోరికను వ్యక్తపరుస్తాడు. దళితుల విజయాలు మన దగ్గర నమోదు చేయరు.  ఇవేమీ వ్యక్తిత్వ వికాస పాఠాలలో సిలబస్ గా మారదు. కులాన్ని విస్మరించే ఏ విజయమైనా ప్రధాన స్రవంతి మీడియాకు సమ్మతమే. ఈ దేశంలో ప్రధాన స్రవంతి ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించే విజయగాధలు నమోదు చేసిన పుస్తకమే రజిత కొమ్ము రాసిన 'దళిత్ డైరీస్'.

ఇందులో రాసిన 25 మంది విజయగాధలు అన్నీ కోల్పోయిన జీవితాలలో వెలుగు రేఖలు నింపిన ఆత్మగాధలు. నిజంగా దళిత సమాజానికి ఈ సమయంలో కావాల్సిన కథలు. తమ వేదనామయ జీవితాలలో ఒక  ఆశ మొలకెత్తుతుంది అన్న నమ్మకాన్ని ఇవ్వగలిగిన ప్రేరణాత్మక వచనం ఈ పుస్తకం.

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ దేశంలో దళితుల విజయగాధలు విస్మరించబడ్డాయి. వారికి స్ఫూర్తి నిచ్చే చరిత్ర అందరిదీ కాకుండా పోయింది. అందుకే ఇప్పుడీ పనిని కొత్తగా అక్షరాలు తలకెత్తుకున్న దళిత యువత తమ మూలాల్లోకి వెళ్లి మరీ వెలికి తీస్తుంది. అలాంటి పనినే సమర్ధంగా నిర్వహించారు కొమ్ము రజిత. ఒక కాలమ్ గా వచ్చిన ఈ జీవన రేఖలు అన్నింటినీ ఇప్పుడీ పుస్తకం గా మనముందుకు తీసుకొచ్చింది. మొత్తంగా 25 మంది విజయగాధలు ఈ పుస్తకంలో నమోదు చేసింది. ఈ దేశంలో నదులు పారుతున్నా గుక్కెడు నీళ్లకోసం తమ చెలమను తామే తవ్వుకోవాల్సిన పరిస్థితి దళితులది. ఇదిగో అలాంటి మట్టిమనుషుల కొత్త చరిత్రను ఈ పుస్తకంలో చూస్తాం.

పదిమంది మహిళలు డోలు వాయించడం ద్వారా తమ అస్తిత్వాన్ని ప్రకటించడం, ముఖ్యంగా భూస్వామ్య, పితృ స్వామ్య, కులవివక్ష, ఖాప్ పంచాయితీలు, నిరక్షరాస్యత, పేదరికం ప్రధానపాత్ర వహించే ఉత్తర ప్రదేశ్ లోని ఒక చిన్నగ్రామం నుంచి తమ విజయాన్ని చాటడం ప్రధాన స్రవంతి మీడియాలో కనిపించని విజయగాధ.

ఏమి తినాలో, ఏమి తినకూడదో సవాలక్ష ఆంక్షలు ఇప్పుడు. దళితుల ఆహారపు అలవాట్లు మీద దాడి ఆధ్యాత్మిక వేత్తలనుంచి, అగ్రవర్ణాల నుంచి ఎంత తీవ్రంగా ఉందో అందరికీ తెలిసిందే. ఇలాంటి సందర్భంలో మా ఆహారపు అలవాట్లు ఇవి అంటూ అంతర్జాతీయ వేదికపై కళాత్మకంగా నినదించిన 23 ఏళ్ల మరాఠీ అమ్మాయి రాజ్యశ్రీ గుడీ విజయం మనందరిదీ.

దక్షిణ భారతదేశంలో పా.రంజిత్, మారి సెల్వరాజ్ లాంటి దళిత దర్శకుల విజయాలు మనం చూస్తున్నాం. అయితే ఉత్తర భారత దేశంలో పాతుకుపోయిన కులవ్యవస్థ దృఢత్వం గమనించినప్పుడు అక్కడ సాధించిన ప్రతి విజయమూ దళిత జీవితాలలో భవిష్యత్తు పట్ల ఆశలు రేకెత్తించేవే అవుతాయి. తన దళిత ఐడెంటిటీ ని బహిరంగంగా ప్రకటించిన దర్శకుడు నీరజ్ గేవాన్; ఇప్పటివరకు బాలీవుడ్  కులం ఫాక్టర్ ను అడ్రస్ చేయలేదని, తాను ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తానని ప్రకటించడం ఒక సాహసం. పా.రంజిత్, నాగరాజు మంజులే లాంటి దళిత దర్శకులతో DALIFF (దళిత్ ఫిల్మ్ అండ్ కల్చరల్ ఫెస్టివల్) ను 2019 లో ఏర్పాటు చేయడాన్ని భవిష్యత్తు లో దళితుల విజయంగా చూడాలి. అలానే అంబెడ్కర్ చెప్పిన మాస్టర్ కీ ఆచరణ అయిన కాన్షీరాం పై సినిమా తీసిన అర్జున్ సింగ్ మౌర్యది ఒక విజయ గాధ.

బూట్ పోలిష్ చేసే సన్నీ ఇండియన్ ఐడల్ పోటీల్లో పాల్గొనడం, దళిత జర్నలిస్ట్ గా విజయాన్ని లిఖించిన శివాదేవి, పెళ్లి ఊరేగింపు కై అధికార, కుల వ్యవస్థ పై పోరాడి విజయం సాధించిన సంజయ జాతవ; భాషకు లిపినిచ్చిన 16 సంవత్సరాల యువకుడు ఆకాష్ వీళ్ళందరూ స్ఫూర్తి దాతలే.

ఒక మిఠాయి దుకాణంలో పనిచేస్తూ దాదాపు 22 కవిత్వ గ్రంధాలు ప్రచురించి  పద్మశ్రీ అవార్డు ని పొందిన హల్దార్ నాగ్ మరో స్ఫూర్తి ప్రదాత. సాహిత్య సముదాయాలలో అసహ్యంగా పిలువబడిన వాడుక భాషలో, అట్టడుగు జనం మాట్లాడే భాషను వాడి రాసిన తన ఆత్మకథ 'కరుక్కు' ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన తమిళనాడు కి చెందిన రచయిత్రి బామా ఫాస్తినా సూసైరాజ్ ది మరొక విజయగాధ.

చరిత్రలో మరుగున పడిన గొప్ప దళిత వ్యక్తుల జీవితాలను కూడా ఈ పుస్తకంలో చూస్తాం. అంబేద్కర్ తో పాటుగా రెండు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్న దళిత మేధావి, దళితుల పట్ల వివక్షను అంతర్జాతీయ దృష్టికి తీసుకొచ్చిన తమిళనాడు కి చెందిన రెట్టమలై శ్రీనివాసన్, భారత రాజ్యాంగ పరిషత్ లో ఏకైక దళిత మహిళ దాక్షాయణి వేలాయుధన్, మలయాళంలో మొదటి కథానాయకి రోజీ, మొట్టమొదటి దళిత క్రికెటర్ పాల్వాన్కర్ బాలూ, దేశంలో పిన్నవయస్సులో ముఖ్యమంత్రి గా పదవి చేపట్టిన దామోదరం సంజీవయ్య, హిందీ సినిమాకు తన పాటలతో రక్తమాంసాలద్దిన పాటల రచయిత శైలేంద్ర,  కేరళ సామాజిక సంస్కర్త అయ్యంకాలి వంటి అనేక మంది దళిత వ్యక్తుల జీవితాలను మనం ఈ పుస్తకంలో చూస్తాం.

దళిత పారిశ్రామికవేత్తలు రాజా నాయక్, దళితుల ఆత్మగౌరవాన్ని చాటేలా వినియోగ వస్తువులను ఉత్పత్తి చేసే చమార్ స్టూడియో ని స్థాపించిన సుధీర్ రాజభర్ లవి స్ఫూర్తినిచ్చే విజయగాధలు.

 ఇలాంటి విజయాలు దళితుల జీవితాల్లో భవిష్యత్తు పట్ల ఒక ఆశను మొలకెత్తించేవే అవుతాయి. ప్రధాన స్రవంతి విస్మరించే ఈ గాధలు చేరాల్సిన వాళ్లకు చేర్చే ప్రయత్నాన్ని చేసిన రచయిత్రి కొమ్ము రజిత అభినందనీయురాలు. ఈ పుస్తకం పాఠశాలల్లోకి, దళిత కమ్యూనిటీల్లోకి విస్తృతంగా చేరాల్సిన అవసరం ఉంది.

మల్లవరపు ప్రభాకరరావు

Comments

Popular posts from this blog

అజాత శత్రువు

మధురకవి మల్లవరపు జాన్ గారి పై సాహీతీ కౌముది ప్రత్యేక సంచిక