IGNORANT BLISS - The Inflorescence of an adolescent
పుస్తకపఠనం అనేది యువతలో రోజురోజుకీ తగ్గిపోతున్న నేటి కాలంలో పద్దెనిమిది సంవత్సరాల టీనేజర్ రాజీవ్ 'ఇగ్నోరెంట్ బ్లిస్' పేరుతో ఇంగ్లీషులో ఏకంగా ఒక కవితాసంకలనాన్నే తీసుకొచ్చాడు. రంగురంగుల ప్రపంచంలోని ప్రతి అనుభూతినీ రివ్వున ఎగిరే సీతాకోక చిలుకల్లా తమ సొంతం చేసుకోవాలనుకునే వయసులో మనిషి సాటి మనిషితో కలిసి నిర్మించుకోవలసిన సామాజిక అవసరతను బాహాటంగా, అంతర్లీనంగా కలల రూపంలో తన కవితల్లో చెప్పిన రాజీవ్ నేటి జనరేషన్ పిల్లలకంటే రెండు జనరేషన్లు ముందు ఉన్నట్లుగా అనిపిస్తాడు.
మనిషికి ఉండాల్సిన స్వభావం, నిర్మలమైన హృదయం, తప్పులు చేయడం, అందులోనుండి పాఠాలు నేర్చుకోవడం, జీవితం మీద ఆశావాద దృక్పదం కలిగి ఉండటం, కొన్ని కోర్కెలు, కుటుంబం, స్నేహం వంటి విషయాలని స్పృశిస్తూ సాగిన రాజీవ్ కవితాప్రవాహం చాలాచోట్ల మనల్ని అలా నిలబెట్టి మనల్ని మనకి పరిచయం చేస్తుంది, ఎదిగేకొద్దీ మనకి అలవడాల్సిన విశాల దృక్పధాన్ని తెలియజేస్తుంది. జాతి, కులం, ప్రాంతం వంటి విషయాలను ఎంతకాలం భుజాలమీద మోసినా చివరకి మనిషికి మనిషి మాత్రమే తోడు అనే పచ్చి నిజాన్ని మన కళ్ల ముందు పెడుతుంది.
కవి ప్రతి కవితలోనూ తన వయసుకి మించిన పరిణతి చూయించాడు. టీనేజ్లో యువతను ఇన్ఫ్లుయన్స్ చేసే ఆవేశం, ఎమోషన్లని కాకుండా ఉన్నతమైన ఆలోచనలను , వాటి ఆవశ్యకతను చెప్తాడు. 'Two Worlds' కవితలో బయటకి కనబడే కృత్రిమ మనిషిని వదిలించుకుని నీ నిజమైన లోపలి మనిషిని ప్రపంచానికి పరిచయం చేయమంటాడు.
'Dream Again' కవితలో మనిషి ఉన్నతమైన ఆలోచనలు, చిన్నపిల్లల్లో ఉండే ఉత్సుకతను కలిగివుండాలని మనిషి యొక్క కంప్లీట్నెస్ కి పర్ఫెక్ట్ డెఫినిషన్ ఇస్తాడు. మరొక కవితలో "A selfless act needs a soulful cheer'" అని చెప్పి మానవుల యొక్క స్టీరియోటైప్డ్ ఆలోచనా ధోరణులను, హిపోక్రసీ, జలసీలను సుతిమెత్తగా ఎండగడతాడు. "There is a morning that is meant for you" అని చెప్పడం ద్వారా ఎన్నిసార్లు విఫలమైనా నీదంటూ ఒకరోజు వస్తుంది, ప్రయత్నస్తూ ఉండటమే అని సక్సెస్ సీక్రెట్ చెప్తాడు.
ఇలా కవి ప్రతి కవితలోనూ అత్యున్నతమైన, పరిపూర్ణమైన, మనసుకి హత్తుకునే ఆలోచనలను చాలా తేలిక పదాలలో మనకి పరిచయం చేస్తాడు. తన కవితాసంకలనానికి 'Ignorant Bliss' అని, ఒక ఆక్సిమోరాన్ ని ఉపయోగించడం, పదాలు, వాక్యాల మధ్య రైమ్ స్కీమ్ ని చాకచక్యంగా వాడటం, 'too little time I have spent for the mind', 'and dream I shall of the good times' అని అంటూ పొయటిక్ జస్టిస్ కోసం వాక్యనిర్మాణాన్ని చాకచక్యంగా ఉపయోగించడం కవిలోని పొయటిక్ నాలెడ్జికి నిదర్శనం.
ఈ సంకలనంలోని కవితలు చదివాక A good listener is a good speaker అన్నట్లు a good reader is a good writer అని కూడా చెప్పవచ్చు అనిపించింది. కవి, తాను చెప్పిన ప్రతి మాటలోనూ, ప్రతి భావంలోనూ జాన్ డన్ లాంటి కవులను, పికాసో లాంటి చిత్రకారులను, నెక్ వూయ్జెచ్ లాంటి మోటివేషనల్ స్పీకర్లను మనకి గుర్తు చేస్తాడు.
'Which Way' కవితలో సుప్రసిద్ద అమెరికన్ పోయట్ రాబర్ట్ ఫ్రాస్ట్ రాసిన 'Road not Taken' యొక్క స్పూర్తి, అలానే 'Through Their Eyes' కవితలో విలియం హెన్రీ డేవిస్ రాసిన 'Leisure' కవిత యొక్క స్పూర్తి మనకి ప్రతిభావంతంగా కనబడుతుంది. పద్దెనిమిది సంవత్సరాల ప్రాయంలో ఎంత విస్తృతంగా చదివితే అంత గొప్ప ఫిలాసఫీనీ, సరైన యాటిట్యూడునీ, ఆప్టిమిజాన్నీ, ఆశలనూ, నిష్పక్షపాతంగా తన జీవిత గమనాన్నీ, గమ్యాన్నీ కవితాత్మకంగా చెప్పగలిగాడు!
తన భావాలను పాఠకులకు చేరవేయటానికి ఎక్కువ కవితల్లో కలను కెటలిస్టుగా ఉపయోగించడం కవి యొక్క దూరదృష్టికీ, భవిష్యత్తు మీద అతనికి ఉన్న ఆశకు ఉదాహరణ. రానున్న రోజుల్లో రాజీవ్ ఒక ఉన్నతమైన కవిగా ఎసుగుతాడనడంలో ఏమాత్రం సంకోచం లేదు. ఆ స్థాయికి చేరుకోటానికి అవసరమైన సాధనాలనూ ఎప్పుడో సంపాదించుకున్నాడు. ఇక చేయాల్సినది ప్రయాణమే. "సుకవి జీవించె ప్రజల హృదయాల యందు" అని మహాకవి జాషువా గారు అన్నట్లు ఈ యువకవి మరింత పదునైన కవితలతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటూ, ఇంతటి జీవజలపు ఊటలాంటి పుస్తకాన్ని ప్రచురించిన సిక్కోలు బుక్ ట్రస్ట్ వారికి
అభినందనలు
.
..... జాషువా డేనియల్
Comments