పాదముద్ర

ఈ దారి వెంబడి నడుస్తూ వెతుకుతున్నా
ఫ్రతి అడుగుని తాకుతున్నాను
ఏదో అలికినట్లుగా
అసలు అడుగు మాయమైనట్లుగా పైపై పూతలు

ఆ అడుగును తుడిచేసారేమో అనిపిస్తుంది
ఏదో మోసం జరిగింది
ఏదో కుట్ర తాకింది
దీనిలో నిర్మాణం లేదు
విధ్వంసం మాత్రమే ఉంది
ఏదీ మిగల్చకుండా గుర్తులను
మరుగుపరిచే మర్మం ఉంది

ఆవును ఈ పాదమెవరిదో
తనది కాని దుఖ్ఖం నటిస్తుంది
నాటకీయతేంటో తెలీని పాదముద్రలను వెలివేసి
జీవితంలోని నాటకీయతను నర్తిస్తుంది

అవును ఈ గీతలు
కాస్సేపు రోదిస్తున్నట్లుగా, ప్రేమిస్తున్నట్లుగా
ఏమీ లేని తెరమీద రంగులద్దినట్లుగా మాయ చేస్తుంది
ఈ పాదాల లోగిట్లో ఏవో అస్పష్ట అంతరంగిక భాషణలు వినిపిస్తున్నాయి
వాస్తవమొక్కటీ లేని అబద్ధాన్ని నిజంగా పలకడానికిపడే పాట్లన్నీ కనిపిస్తున్నాయి
దూషించడానికి గల కారణాన్ని
ద్వేషించడానికి కావల్సిన సరంజామాని
జాగ్రత్తగా భద్రపరుస్తున్నాయి
చెమటతో తడిసిన పరిమళం ఈ పాదముద్రలకు లేదు
ఎన్ని వేల పాదముద్రలను తుడిచేసి ఈ కాంక్రీటు రూపాన్ని సృష్టించారో
మహా రహదారిని నిర్మించడానికి చీలికదారిని వచ్చి చేరిన
జనపదపు బాట నేడు అదృశ్యమైపోయింది
చౌరస్తాలో తెగిపడిన చేతులు
ముక్కలైన మొండాలు
దారి వెదుక్కోవడానికి నానాయత్నాలు

పాదముద్రలు చరిత్రను నిర్మిస్తాయేకాని విస్మరించదు
అడుగుల సత్తువ తెలిసినవాళ్ళే పిడికిలినీ ఉపయోగించగలరు
కాంక్రీటు నకిలీ ముద్రలనూ బద్దలు చేయగలరు
అప్పటివరకూ నాది కాని ఈ దారిని ఉమ్మేస్తున్నాను

-- మల్లవరపు ప్రభాకరరవు(2003)

Comments

Popular posts from this blog

అజాత శత్రువు

మధురకవి మల్లవరపు జాన్ గారి పై సాహీతీ కౌముది ప్రత్యేక సంచిక