పాఠం

కొంతమంది దగ్గరకు
రాకూడదనేంత కసి
వస్తే వెళ్ళిపొలేనంత వ్యధ
గడప దగ్గరకు వచ్చేలోపల
పదులసార్లు రావాలా!వద్దా!
జంజాటాలు
అడుగుపెట్టాలా! వెనక్కి కదలాలా
సందిగ్ధ సందర్భాలు
వోటమి ఎదురయ్యే క్షణాలుకోసం
బహుశా ఎదురు చూపులు మినహా
మరేమీ చేయలేని వెర్రితనం
ఇదిగొ ఇక తప్పదన్నట్టు
వోడిపోయిన చిర్నవ్వు మొహాన వేలాడేసుకుని
మాయాదీపం సృష్టించిన
జీనీ భూతంలా ప్రత్యక్ష్యమవుతాము

వీళ్ళంటే ఎంత కసి పుడ్తుందో అప్పుడు
పలకరించకుండా మొహం తిప్పుకోవడాలూ
దగ్గరవుతున్నప్పుడు దూరమవడాలూ
బొత్తిగా తెలీని పిల్లల్లా
ఎదురుగా వచ్చి ఆలింగనం చేసుకుంటారు
ఇక చూస్కో
నాలోని నరాలు క్రుంగిపోయి
నాలోని మనిషి వోడిపోయి
నేను నిజమయిన నవ్వులు నాలుగు చిందించి
నిజమయిన మాటలు నాలుగు పొంగించి
నాలొ కల్మషాన్ని
హుస్సేన్ సాగర్ మురికినాలాలోకి దొర్లించి
క్షాళనాపర్యంతమవుతాను
వీళ్ళెప్పుడూ ఇంతే!
నేనీ జీవన వ్యాపారంలొ మునిగినప్పుడు
గుప్పెడు జ్ఞాపకాల్ని
బహుమానంగా ఇచ్చిపోతారు
నేనీలోకాన్ని డేగకళ్ళతో వీక్షిస్తున్నప్పుడు
వీళ్ళు పసిపిల్లల నవ్వులు చిందిస్తూ
నాకొపాఠం చెబ్టున్నట్లుగా అనిపిస్తారు.
---- మల్లవరపు ప్రభాకరరావు
03.06.2010(1.55pm)

Comments

Popular posts from this blog

అజాత శత్రువు

మధురకవి మల్లవరపు జాన్ గారి పై సాహీతీ కౌముది ప్రత్యేక సంచిక