అనూభూతి స్పర్శనందించిన శతకం !

' మధురకవి' బిరుదాంకితులు మల్లవరపు జాన్ కవిగారు పద్యం రాసినా, వచనం రాసినా అలవోకగా సాగిపోతుంది. ప్రతి పద్యం ద్రాక్షాపాకంతో రసభరితంగా ఉంటుంది. వేదాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉండే నిగూఢమైన భావాల్ని కూడా సరళంగా అర్థమయ్యే శైలీలో వర్ణించ గల ప్రతిభాశాలి జాన్ గారు. అలాంటి కవిగారి కవిత్వాన్ని సమకాలీన దిగ్గజ్జాల్లాంటి కవులు కూడా మెచ్చుకోవటం ఒక ప్రత్యేకత. అయితే, ఆయన గురించి ఒక శతకమే వెలువడటం మరో విశేషం.
ప్రముఖ కవి, అవధాని చేగిరెడ్డి చంద్రశేఖర రెడ్డిగారు మల్లవరపు జాన్‌కవి జీవితం, వ్యక్తిత్వం, రచనలలో కనిపించే తత్త్వం ఇలా అన్నింటినీ రసభరితంగా వర్ణిస్తూ " మధురకవీంద్రశతకం"ను రాశారు.
ఒకటి రెండు పద్యాలు మినహా "కవీంద్ర" అనేదే మకుటం. ఈ మకుటాన్ని ఎన్నుకోవటంలోనే చంద్రశేఖర రెడ్డిగారికి, జాన్‌కవిగారి పట్ల గల అభిమానం వ్యక్తమవుతుంది. జాన్‌కవిగారి కుటుంబాన్ని బాగా పరిశీలిస్తేగాని రాయలేని కొని పద్యాలు ఈ శతకంలో కనిపిస్తున్నాయి.
" వ్యాసునకు వినాయకునటు
వ్రాసెను మధురమున కొడుకు రాజేశ్వరరావ్
వాసిని గాంచగ కృతులన్
శ్యాసయనగ మెల్గి నాడు !జాన్ కవీంద్రా!"
జాన్‌కవిగారి కుటుంబం గురించి తెలియకపోతే ఈ పద్యాన్నెవరూ రాయలేరు. జాన్ కవి గారి కుటుంబమంతా చక్కని సాహిత్య వాతావరణంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక వైపు తాము నమ్ముకున క్రైస్తవ జీవితంలోని ప్రశాంతతనూ, మరో వైపు సంసారపూరితమైన సాహిత్య చర్చలతో కుటుంబం ఎంతో ఆనందభరితంగా సాగిపోతుంటుంది. నన్నుకూడా ఒక సారి ఒక సాహిత్య కార్యక్రమానికి వాళ్ళ ఊరు పిలిచి, సన్మానం చేశారు. ఆ సందర్భంగా జాన్ కవిగారితో ఒక రోజు గడపగలిగే అవకాశం లభించింది. వాళ్ళ కుటుంబాన్ని దగ్గరగా చూడగలిగే వీలు కలిగింది. చంద్రశేఖర రెడ్డి గారు, జాన్ కవి గారికి, రాజేశ్వరరావు గారిని విఘ్నేశ్వరునితో పోల్చగలగడం సరైనదని ఆ కుటుంబాన్నిదగ్గరగా చూసిన నాకు గొప్ప అనుభూతిని కలిగించగలిగింది. జాన్ కవి కుమారుడు రాజేశ్వరరావు, రాజేశ్వరరావు కుమారులు ప్రభాకర రావు, సుధాకర్ రావులు కూడా కవులే! ఒకరిపట్ల మరొకరికి ఎనలేని విధియ, విధేయతలు! వీటన్నింటిని చెప్పకుండానే ఆ స్ఫురణ కలిగిస్తూ ఆ వారసత్వాన్ని ఒక్క పద్యంలోనే కవి వర్ణించటం ఎంతో సముచితంగా ఉంది.
కావ్యానికీ, శతకానికీ మధ్య గల భేదాలలో ముఖ్యమైనది కథ! కావ్యంలో కథ ఉంటుంది. శతకంలో ఒక్కో పద్యానికీ ఒక్కో కథ స్పురింపజేయగలిగే శక్తి ఉంటుంది. ముక్తకాలతో కూడిందే శతకం. అయినా ఈ శతకంలో జాన్ కవి మూర్తిమత్వం, కవిత్వం, బోధనా ప్రభావం, రచనల వైశిష్ట్యం వంటి వాటినెన్నింటినో కవి వర్ణించారు. ఆ విధంగా చూసినప్పుడు "మధుర కవీంద్ర శతకము"నకు ఒక ప్రత్యేకత ఉందని స్పష్టమవుతుంది.
జాన్ కవి శైలిని, వస్తు వైశిష్ట్యాన్ని వర్ణిస్తూ ఈ శతక కవి రాసిన...
"రచయించితిరి కవితలను
రుచిజూపితిరెన్నో వేదబుక్కుల సూక్తులన్
ప్రచురించినారు కృతులను
వచనములో గూడ మల్లవరపు కవీంద్రా!" అనే పద్యాల్లాంటివెన్నో ఈ శతకంలో ఉన్నాయి. ప్రతి పద్యం ఒక రత్నంలా భాసిస్తోంది. సాహిత్య చరిత్రలో జాన్ కవి గారికి ఇప్పటికే ఒక విశిష్ట స్థానం ఉండగా, ఆ స్థానాన్ని ఈ శతకం మరింత ద్విగుణీకృతం చేస్తుంది. జాన్ కవితో, ఆయన సాహిత్యంతో సాన్నిహిత్యం ఉన్నవాళ్ళకే కాకుండా, ఆయన ఎలా ఉంటారో, ఆయన సాహిత్యం ఎలా ఉంటుందో తెలియని వాళ్ళకి కూడా ఈ శతకం ఎంతో అనుభూతినీ, ప్రేరణను కలిగించేటట్లు వర్ణించిన కవి చేగిరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారు ఎంతైనా అభినందనీయులు!

- డా// దార్ల వెంకటేశ్వర రావు (6-1-09)

Comments

Popular posts from this blog

అజాత శత్రువు

మధురకవి మల్లవరపు జాన్ గారి పై సాహీతీ కౌముది ప్రత్యేక సంచిక