పద్యాల్లో సమకాలీన సమస్యలు

మల్లవరపు జాన్ కవిగారి అబ్బాయి శ్రీ మల్లవరపు రాజేశ్వరరావు తండ్రి నుండి పద్యరచనా వారసత్వాన్ని అందిపుచ్చుకున్న చందానికి దాఖలా ‘జీవనది’ పద్య ఖండికా సంపుటి. వస్తు వైవిధ్యం, పద్య శిల్పంలో రాజేశ్వరరావుగారు ఈ రచనల్లో మంచి పారీణతతో ప్రదర్శించారు. సమకాలిక అంశాలనుకూడా పద్యాలలో ప్రతిబింబించడం కవి నేర్పుపై ఆధారపడి వుంటుందని, ఇందులోని పలు ఖండికలు నిరూపిస్తాయి. అన్వయ క్లిష్ఠత లేని ఒక ధార రచనలో కానవస్తుంది.
నలభై రెండు ఖండికల ఈ పద్య సంపుటిలో ప్రేమ, దేశభక్తి, శ్రమజీవన చిత్రణ, ప్రకృతి వర్ణన, అస్పృశ్యతా నిరసనం, కవిప్రశంస, పర్వదిన వివరణ వంటి అంశాలున్నాయి. రైతును ప్రశంసిస్తూ-
నీవులేని నాడు నిఖిల లోకమె లేదు
హలము కదిపి పొలమునంత దున్ని
పంటనిడుచు జనుల ప్రాణాల నిలబెట్టు
హాలికుడవు! జగతి పాలకుడవు
అంటారు. ఆధునిక వ్యవసాయం, రైతు జీవనం ఎన్ని మార్పులకు గురి అయినా ఇంకా హలము, పొలము వంటి పదాలు లేకుండా రైతు జీవన చిత్రణం సాధ్యంకాదేమో!
‘‘పొట్టకు మెతుకులు చిక్కక
దిట్టత కోల్పోయి జనుల దీనతదోపన్
దిట్టుచునుండగ, నీ కం
ప్యూట్టరు పథకాలు తిండి పొట్టకు నిడునా!’’
అని ఆధునికతా నిరసనం చేయడంవల్ల ప్రయోజనం కోల్పోకూడని విలువల గురించిన స్పృహ అని గుర్తించడం సబబు. మల్లవరపు రాజేశ్వరరావు ‘జీవనది’లో నిర్ద్వంద్వంగా ‘‘రభస లేపుచును తెలంగాణ మీనాడు- వేరుపడుట మంచిదారియగునె- ప్రగతి సాధనంబె పరమార్థమని యెంచి- సాగవలెను ఐక్యసాధనమున’’అని సమైక్య భావనను ప్రకటించడం చూస్తాం. ఏమైనా హృద్యమైన పద్య కవితా సేద్యం చేస్తున్న కవి కృషీవలుడు అభినందనీయుడు.
-అల్లంరాజు
ఆదివారం ఆంధ్రభూమి(26.12.2010)

Comments

Popular posts from this blog

అజాత శత్రువు

మధురకవి మల్లవరపు జాన్ గారి పై సాహీతీ కౌముది ప్రత్యేక సంచిక