అజాత శత్రువు
"పనస తొనలకన్న పాల మీగడకన్న
మధువుకన్న ముగ్ధ వధువు కన్న
మల్లవరపు కవిత మధురాతి మధురమ్ము
'జాను ' తెనుగు మేలి జాను తెనుగు" (కరుణశ్రీ)
సనాతన సంప్రదాయాన్ని మన్నిస్తూనే వాటిలోని బలహీనతలను త్రోసి రాజనగల జాతీయోద్యమ నవ్య భావకవిత్వోద్యమంలో నుండి అభ్యుదయ వాద కవిత్వోద్యమం ఆవిర్భవించింది.ఈ రెండు ఉద్యమాలే 20వ శతాబ్దపు సాహిత్యరంగాన్ని శాసిస్తున్నాయి.మొదటి దానికున్న ప్రాపంచిక దృక్పధం భావాత్మకమైనది.రెండవ దృక్పధం భౌతిక సాంఘిక, సామాజిక, రాజకీయాత్మక మైనది. ఇటు నవ్య సాంప్రదాయం అటు అభ్యుదయ కవితా దృక్పధం, దళిత, స్త్రీవాద ఉద్యమాలను మేళవించి వారధిగా నిలచిన యుగపురుషుడు నవయుగ కవితా చక్రవర్తి, మహాకవి జాషువా. ఆయన మార్గమును ఎన్నుకొని కవితా ప్రస్థానమును కొనసాగించిన మహోద్ధాత్త వ్యక్తి మధుర కవి జాన్.
ఆధునిక భావజాలాన్ని వ్యక్తీకరించడానికి పద్యం వాహిక కాదని ఛందస్సు ఆటంకమని అభ్యుదయ వాదుల ఆరోపణ.శ్రి జాన్ కవి తెలుగు భాష లోని నుడికారపు సొంపు చేతను, ఉపమా,రూపక,అర్ద్థాంతర న్యాసాది అలంకారముల ప్రయొగముతోను, వర్గ సంఘర్షణ, దోపిడి విధానముపై తిరుగుబాటు,ఆర్ధిక వత్యాసాల నిర్మూలన,సమసమాజస్థాపన వంటి భావజాలాన్ని కవితా వస్తువులుగా స్వీకరించి కవిత్వీకరించుటలో, పద్యరూపం,ఏ భావాన్నైనా బలంగా ,ప్రజా రంజకంగా చెప్పడానికి పనికి వస్తుందని ,సాధికారంగా, చూపడానికి చేసిన పనితనం, నైపుణ్యం గొప్పవి.
ఆధునిక కాలంలొ విస్తృత వ్యాప్తి కల్గిన పద్య కవిత ప్రక్రియ ఖండకావ్యం. ఈ కవితా మార్గానికి బాట వేసిన ఆద్యుడు రాయప్రోలు-దీనికి విస్తృతవ్యాప్తి కల్పించి,జన సామాన్యానికి అందుబాటు లోనికి తెచ్చినవాడు జాషువా. ఈ మార్గావలంబి అయినవారిలో అగ్రేసరుడు జాను కవి.
ఆటవెలదిని పట్టుకొమ్మగా ఆశ్రయించి,అలతి,అలతి పదాలతో, మూఢవిశ్వాసాలను ఖండించడానికీ కాక నిగూడ వేదాత్ట విషయాలను విప్పి చెప్పిన శతక కర్త వేమన. ఆయన అడుగు జాడలలో ఆటవెలది ఛాయలలొ, పద్యాన్ని జనసామాన్యానికి అందించిన ఘనత శ్రీ నండూరి తరవాత జాన్ కవికే చెల్లుతుంది.
శ్రీ జాన్ సంస్కృతాంధ్రంలో ప్రజ్ఞానిధి. పద్యపఠనం ఆపాత మధురం. చక్కనివక్త,పదాల రంగుని,రుచిని, వాసనని తెలిసిన కవితా మర్మజ్ఞుడు. జాన్ కవిత్వం స్వీయానుభవం నుండి ఆత్మ వేదన నుండి జాలువారింది.కుల మత వ్యవస్థను కూకటి వేళ్ళతొ పెళ్ళగించడానికి కలాన్ని హలంగా స్వీకరించిన యోధుడాయన.సంఘ సంస్కరణ ప్రధాన లక్ష్యంగా ఆయన ఖండకావ్య రచన చేపట్టారు. అస్పృస్యత మత మౌఢ్యం సాంఘిక దురాచారములు మూఢాచారాల ఖంఢన ఆయన కావ్యాలలో అంతర్లీనంగా సాగిన సామాన్య లక్షణాలు. ఆయన కవిత్వంలో మాధుర్యం, సారళ్యం, సదుపదెశం తగుపాళ్ళలో మేళవించబడ్డాయి.మార్గాకవితావలంబి అయిన కవిత్వం ప్రధానంగా వస్త్వాశ్రయం .కావ్యకుసుమాలన్నింటిలొ అంతస్సూత్రంగ కరుణ రసం వెల్లివిరుస్తోంది. ఆయన కవిత్వంలో జీవలక్షణం ఆర్ధ్రత.శ్రీ జాన్ అత్యాధునిక కవుల లో అజాతశత్రువు ,దైవభక్తి,దేశభక్తి, సామాజిక స్వభావం,మృదుస్వాభావికత ఆయన వ్యక్తిత్వాన్ని మహోన్నత స్థాయిలో నిల్పిన ప్రత్యేక లక్షణాలు.
వేమనలొని సంస్కరణవాదం, జాషువాలోని అభ్యుదయ, సామాజిక దృక్పధం, కరుణశ్రీలోని పదలాలిత్యం త్రివేణిసంగమంగా ఆయనలో మూర్తీభవించినవి.చమత్కారవైభవం ప్రధానంగా సూక్తివైచిత్రి ఈయన కవిత్వాన్ని సుసంపన్నం చేసి జనరంజకంగా మలచబడ్డది. మిత్రత్వం, ఆశ్రిత శిష్యప్రీతి ఆయనకు కర్ణాభరణాలు.
జానుకవి ఆత్మ 'అతుకులబ్రతుకులు ' లో నిక్షిప్తమైంది. భావవిపంచి ,సూక్తిశతకం ఆయన కవితాఝరిని హొరెత్తించినది సాంసన్-డెలీలా(నాటకం) 'విశ్వప్రకాశం",చిరస్మరణీయులు ',కాంతి రేఖలు(సమస్యాపురణ)',ఎయిడ్స్ రోగి(బుర్రకధ),' పంచముడు ',' స్వగతమూ" కావ్యాలు వారిలోని అన్య కవితాపార్శ్వాలను స్పృశిస్తాయి. వారి రచనలన్నింటి లో ప్రసిద్ధికెక్కినది 'అతుకుల బ్రతుకులు '. ఆధునిక ప్రజా జీవనానికి సంబంధించిన పేదరికం, వరకట్నం, మద్యపానం,అస్పృశ్యత వంటి దురాచారాలను తన ఆదర్శ ఖంఢికా దశకముతోఒ పురోగమించిన గుణభూయిస్ట కవితావతంసుడు. అతుకూల బ్రతుకులు, త్రాగుబోతు ఈ గ్రంధము లోని కధాఖండికలు.పేకాట, తాగుడు వంటి దురభ్యాసాలను సందేశ రూపం కంటే కధా రూపంలొ అందిస్తే పఠిత హృదయాన్ని హత్తుకుంటుందని కవి భావన.
జాన్ కావ్యాలలొ ప్రత్యేక ప్రశంసకు అర్హమైన కావ్యం 'సూక్తి శతకం 'లో సున్నిత హాస్యం, వ్యంగ్యం ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. ప్రతి పద్యం ఒక ఇక్షు ఖండం. శైలి, పదముల పోహళింపు మనోహరం. భావ వీచికల సమాలోచన ఈ శతకం.ప్రాచీన అర్వచీన ధోరణలను జీర్ణించుకొని ఆధునికతకు ప్రాధాన్యమిస్తూ విషయ శ్రేయస్సుకు ఉపకరించే సూక్తులను సమాజ పురోభివృద్ధికి అందించేరు.
మచ్చుకు ఒక్క సూక్తి:
"కాకి బాధతో 'కావుకావని 'యేడ్వ
కాకలోకమంత కదలివచ్చు
మనిషిబాధ ప్రక్క మనిషి గుర్తుంపడే
సజ్జనానురక్తి జాను సూక్తి"
ఆయన రచనలలొ 'సాంసను-డెలీలా' నాటకము నాల్గు వందల పైగా ప్రదర్శనలు పొందింది.'అతుకుల బ్రతుకులు ' కావ్యం మైసూర్ విశ్వవిద్యాలయం వారి పాఠ్య గ్రంధంగా ఎంపికైంది. శ్రీ జాన్ కవికి కీర్తి కండూతి మృగ్యం.'కవిభూషణ,అభినవబాణ,మధురకవీ ఆదిగా గల బిరుదులు ఆయనను వరించి వచ్చినవి.ఆయనకు శతాధిక సన్మానము లు జరిగినవి. ముఖ్యమైనవి-తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం-సువర్ణ కంకణముతో సత్కారం. ప్రకాశం జిల్లా సాహిత్య చరిత్రలో నాయని సుబ్బారావు తరవాత పద్యానికి ప్రాభవం కల్పించిన మధురకవి జాన్.
"వచ్చునప్పుడు వెంట తెచ్చుకున్నది ఏది?
చచ్చునప్పుడు వెంట వచ్చునేది?
కడకు మంచి చెడులే పుడమిపై నిలుచును
సజ్జనానురక్తి జాను సూక్తి "
జీవితాంతం పద్య నిబద్ధత పాటించిన ఆదర్శమూర్తి శ్రీ జాన్. భావంలో ఎంత ఆధునికత ఉన్నా పద్య రూపంలో వెల్వడితే మా నవ్య భాపుత్రుల,విమర్శకుల పద్య ద్వేషమువల్ల జాన్ కవికి తెలుగు సాహిత్యంలో రావలిసినంత గుర్తింపు రాలేదు. ఆ మహాకవి మధుర వచశ్వి అజాత శత్రువు 80వ జయంతిని పురస్కరించుకొని సాహితీ కౌముది వినమ్రతతో అక్షర నీరాజనం సమర్పిస్తున్నది.
---- శిష్ట్లా వెంకట్రావు,
'సాహితీ కౌముది '
మధురకవి శ్రీ మల్లవరపు జాన్ 80వ జయంతి ప్రత్యేక సంచిక,ఏప్రెల్,2007సౌజన్యంతో..
Comments