Posts

Showing posts from 2010

పద్యాల్లో సమకాలీన సమస్యలు

మల్లవరపు జాన్ కవిగారి అబ్బాయి శ్రీ మల్లవరపు రాజేశ్వరరావు తండ్రి నుండి పద్యరచనా వారసత్వాన్ని అందిపుచ్చుకున్న చందానికి దాఖలా ‘జీవనది’ పద్య ఖండికా సంపుటి. వస్తు వైవిధ్యం, పద్య శిల్పంలో రాజేశ్వరరావుగారు ఈ రచనల్లో మంచి పారీణతతో ప్రదర్శించారు. సమకాలిక అంశాలనుకూడా పద్యాలలో ప్రతిబింబించడం కవి నేర్పుపై ఆధారపడి వుంటుందని, ఇందులోని పలు ఖండికలు నిరూపిస్తాయి. అన్వయ క్లిష్ఠత లేని ఒక ధార రచనలో కానవస్తుంది. నలభై రెండు ఖండికల ఈ పద్య సంపుటిలో ప్రేమ, దేశభక్తి, శ్రమజీవన చిత్రణ, ప్రకృతి వర్ణన, అస్పృశ్యతా నిరసనం, కవిప్రశంస, పర్వదిన వివరణ వంటి అంశాలున్నాయి. రైతును ప్రశంసిస్తూ- నీవులేని నాడు నిఖిల లోకమె లేదు హలము కదిపి పొలమునంత దున్ని పంటనిడుచు జనుల ప్రాణాల నిలబెట్టు హాలికుడవు! జగతి పాలకుడవు అంటారు. ఆధునిక వ్యవసాయం, రైతు జీవనం ఎన్ని మార్పులకు గురి అయినా ఇంకా హలము, పొలము వంటి పదాలు లేకుండా రైతు జీవన చిత్రణం సాధ్యంకాదేమో! ‘‘పొట్టకు మెతుకులు చిక్కక దిట్టత కోల్పోయి జనుల దీనతదోపన్ దిట్టుచునుండగ, నీ కం ప్యూట్టరు పథకాలు తిండి పొట్టకు నిడునా!’’ అని ఆధునికతా నిరసనం చేయడంవల్ల ప్రయోజనం కోల్పోకూడని విలువల గురించిన స్పృహ ...

ప్రారంభం

కలలు తెగిపడిన చప్పుడు వెడుతూ వెడుతూ వీడ్కోలు లేఖ గుమ్మంలో పెట్టినట్లు ఎప్పటిదో తెలీదు రెండు హృదయాల మధ్య శూన్యం స్పర్శ కూడా పట్టివ్వలేదు శూన్యప్రారంభాన్ని దుఖ్ఖంలోంచి శూన్యంలోకి ప్రవహించి ఇప్పుడు కానరాని మౌనమొక్కటే మిగిలింది మౌనం భాష కాకుంటే బాగుణ్ణు కాస్త తలదాచుకోడానికి చోటైనా దక్కేది ప్రశ్నై నిలిచేకొద్దీ లోపల్లోపలే సంకెళ్ళలో బందీగా మారిపోవడం ఆగి ఆగి జ్ఞాపకాలను మోసుకొచ్చే పూల పరిమళం అదృశ్యమైనట్లుగా కన్నీళ్ళు కూడా ఇంకిపోయాయి ఆనవాలు దొరకని సాక్ష్యం దేహంలోంచి దేహంలోకి తొంగిచూడడం అంత సులువేమీకాదు ఇప్పుడు ప్రారంభాన్ని వెతకాలి నిజమైన నమ్మకాన్ని పున:ప్రసారం చేయాలి నమ్మకాల్ని దాచి అవిశ్వాసపు ఒరలలో ఒట్టిపోయిన శూన్య గోళాల్ని గమనించాలి విశాల తీరాల ఒంటరితనంలోకి ఒక యుగళాగీతాన్ని ధ్వనింపచేయాలి --- మల్లవరపు ప్రభాకరరావు(2003)

మల్లవరపు రాజేశ్వరరావు 'జీవనది 'ఖండకావ్య సంపుటి పై సమీక్ష

పాదముద్ర

ఈ దారి వెంబడి నడుస్తూ వెతుకుతున్నా ఫ్రతి అడుగుని తాకుతున్నాను ఏదో అలికినట్లుగా అసలు అడుగు మాయమైనట్లుగా పైపై పూతలు ఆ అడుగును తుడిచేసారేమో అనిపిస్తుంది ఏదో మోసం జరిగింది ఏదో కుట్ర తాకింది దీనిలో నిర్మాణం లేదు విధ్వంసం మాత్రమే ఉంది ఏదీ మిగల్చకుండా గుర్తులను మరుగుపరిచే మర్మం ఉంది ఆవును ఈ పాదమెవరిదో తనది కాని దుఖ్ఖం నటిస్తుంది నాటకీయతేంటో తెలీని పాదముద్రలను వెలివేసి జీవితంలోని నాటకీయతను నర్తిస్తుంది అవును ఈ గీతలు కాస్సేపు రోదిస్తున్నట్లుగా, ప్రేమిస్తున్నట్లుగా ఏమీ లేని తెరమీద రంగులద్దినట్లుగా మాయ చేస్తుంది ఈ పాదాల లోగిట్లో ఏవో అస్పష్ట అంతరంగిక భాషణలు వినిపిస్తున్నాయి వాస్తవమొక్కటీ లేని అబద్ధాన్ని నిజంగా పలకడానికిపడే పాట్లన్నీ కనిపిస్తున్నాయి దూషించడానికి గల కారణాన్ని ద్వేషించడానికి కావల్సిన సరంజామాని జాగ్రత్తగా భద్రపరుస్తున్నాయి చెమటతో తడిసిన పరిమళం ఈ పాదముద్రలకు లేదు ఎన్ని వేల పాదముద్రలను తుడిచేసి ఈ కాంక్రీటు రూపాన్ని సృష్టించారో మహా రహదారిని నిర్మించడానికి చీలికదారిని వచ్చి చేరిన జనపదపు బాట నేడు అదృశ్యమైపోయింది చౌరస్తాలో తెగిపడిన చేతులు ముక్కలైన మొండాలు దారి వెదుక్కోవడానికి నానాయత్నాలు పా...

సెల్యూట్

ఈ రాత్రి కొన్ని కోట్ల స్వప్నాలను చెదిరిపోకుండా ఓ కన్ను పహరా కాస్తుంది తలుపులన్నీ బిడాయించుకుని తలపులకు బార్లాతీసే అనేకానేకమంది స్వగతాల్లోకి దూరం గా మసలుతూ చలిని కప్పుకుంటూ చెలిని తలచుకుంటూ తుపాకీని ఆలింగనం చేసుకునే హృదయమొకటి హిమాలయాలంత ఎత్తులో పహారా కాస్తుంది ఎన్నో రాత్రుల స్వప్నాలను, అనుభూతులను లోపల్లోపలికి కుక్కేసి దూరంగా వినబడే కవాతుల మధ్య బంకర్ల మాటున దాగుతూ ఒక్క క్షణంలో తుపాకీని గురి చూసే కన్నొకటి పహారా కాస్తుంది యుద్ధం సరిహద్దుల్లోనే… సరిహద్దుల్లోని సైనికుల్లోనే కాషన్ తీసుకునే ప్రతిసారీ మెరిసే దూరపు ఆశల నునుపైన మెరుపు గోదావరి వాగుల్లానో,కోనసీమ కొబ్బరాకుల్లానో పాలకొండల పిలుపులానో ఇంటి మొగదాల వేపచెట్టు పలకరింపులానో మెరుపులు… నాన్నెప్పుడొస్తాడని అడిగే చిన్నారి ప్రశ్నలు అన్నీ ఆశలే… బ్రతకడానికైనా,శత్రువుని గురిపెట్టడానికైనా అంతా ఆశే జీవితాన్ని కోల్పోతూనో,గెలుస్తూనో - జీతాన్నందుకున్న అమ్మ కళ్ళ మెరుపు కనిపించని దూరం చెట్టంత అండను తనకొక్కదానికే స్వంతం చేసుకోని గర్వపు క్షణాలు ఇవేవీ స్వగతాలుగా మార్చుకోకుండా కర్తవ్యం మాటున దాచేసి “మా తుఝే సలాం” అంటూ కదం తొక్కాల్సిందే అంతర్గత సంక్షోభాలు అలము...

పరిమళించే 'జాతీ'యత !

కవిత్వమంతా జాతీయతను పరిమళింప చేసే కొద్దిమంది పద్య కవులలో 'మధురకవి' మల్లవరపు జాన్ కవి గారు ఒకరు! ఆయన మరణానంతరం వెలువడుతున్నదీ"స్వగతము". దీనిలోని ఇతివృత్తం జన్మరీత్యా ఒక మాదిగవాని స్వగతం. ఇంకా లోతుగా చెప్పాలంటే కులం వల్ల జీవితమంతా అవమానాల పాలై తన అస్తిత్వానికై తపన పడిన ఓ దళితుని స్వగతం దీనిలో వినిపిస్తుంది. మాదిగ జీవితం చుట్టూ ఆ వర్ణన కొనసాగినా రకరకాల జీవితానుభావాలను ఎదుర్కొంటున్న ప్రతి దళితుని ఆవేదనను ఈ "స్వగతం"లో అక్షరీకరించగలిగారు. ఈ "స్వగతము"ను ఏ ప్రక్రియగా చెప్పుకొనే వీలుందనుకొంటూ చదివాను. మన లాక్షణికులు "ఖండకావ్యం, ఆఖ్యానం, ఆఖ్యాయిక వంటి వాటికి సమానమైన పోలికలున్న కొన్ని లక్షణాలను చెప్పారు. "ఖండకావ్యం భవేత్కావ్యస్యైకాదేశనుసారిచ" అని 'సాహిత్య దర్పణం' ఖండకావ్యం అంటే ఏమిటో వివరిస్తుంది. కవి తాను స్వయంగా చూసిన దాన్ని చెబితే (స్వయం దృష్టార్థ కథనం ప్రాహురాఖ్యానం బుథా) దాన్ని 'ఆఖ్యానం' అని అంటారు. 'కల్పితేతివృత్తం కలిగినదాన్ని కథ' అని 'సత్యేతివృత్తాంతం కలదాన్ని ఆఖ్యాయిక (కథ కల్పిత వృత్తాంతా సత్యార్థాఖ్యాయికా మ...

అనూభూతి స్పర్శనందించిన శతకం !

' మధురకవి' బిరుదాంకితులు మల్లవరపు జాన్ కవిగారు పద్యం రాసినా, వచనం రాసినా అలవోకగా సాగిపోతుంది. ప్రతి పద్యం ద్రాక్షాపాకంతో రసభరితంగా ఉంటుంది. వేదాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉండే నిగూఢమైన భావాల్ని కూడా సరళంగా అర్థమయ్యే శైలీలో వర్ణించ గల ప్రతిభాశాలి జాన్ గారు. అలాంటి కవిగారి కవిత్వాన్ని సమకాలీన దిగ్గజ్జాల్లాంటి కవులు కూడా మెచ్చుకోవటం ఒక ప్రత్యేకత. అయితే, ఆయన గురించి ఒక శతకమే వెలువడటం మరో విశేషం. ప్రముఖ కవి, అవధాని చేగిరెడ్డి చంద్రశేఖర రెడ్డిగారు మల్లవరపు జాన్‌కవి జీవితం, వ్యక్తిత్వం, రచనలలో కనిపించే తత్త్వం ఇలా అన్నింటినీ రసభరితంగా వర్ణిస్తూ " మధురకవీంద్రశతకం"ను రాశారు. ఒకటి రెండు పద్యాలు మినహా "కవీంద్ర" అనేదే మకుటం. ఈ మకుటాన్ని ఎన్నుకోవటంలోనే చంద్రశేఖర రెడ్డిగారికి, జాన్‌కవిగారి పట్ల గల అభిమానం వ్యక్తమవుతుంది. జాన్‌కవిగారి కుటుంబాన్ని బాగా పరిశీలిస్తేగాని రాయలేని కొని పద్యాలు ఈ శతకంలో కనిపిస్తున్నాయి. " వ్యాసునకు వినాయకునటు వ్రాసెను మధురమున కొడుకు రాజేశ్వరరావ్ వాసిని గాంచగ కృతులన్ శ్యాసయనగ మెల్గి నాడు !జాన్ కవీంద్రా!" జాన్‌కవిగారి కుటుంబం గురించి త...

వసంతానికి స్వాగతం

కల్లలైన కలల మధ్య చేదు జ్ఞాపకాలలోని తీపి స్మృతుల మధ్య అలనల్లన నడిచొచ్చే ఉగాదికి స్వాగతం వేపపూత,మావిచిగురు పచ్చదనాల మధ్య కోకిల గీతాల కలకలం మధ్య కోటికలల తీపి గొంతుకలతో స్వాగతం ఒక్కో వసంతం ఎన్ని తీపికలలను వెంట తీసికొస్తుందో ఒక్కో వసంతం ఎన్ని వాడిన జీవితాల కధలను వెంటకొనిపోయిందో పిల్లాడి స్కూల్ ఫీజుల కోసం కాఫీ కప్పులో పంచదార కోసం ఇంటి కొచ్చిన కొత్తల్లుడి గొంతెమ్మ కోర్కెలు తీర్చడం కోసం మా ఆత్మాభిమానాన్ని చంపుకుంటున్నా వసంతానికి ఆహ్వానం చెబుతుంటాం నింగినంటుతున్న ఉల్లి కన్నీటిజల్లై కురుస్తున్నా హైటెక్ టాక్స్ ల ఇంద్రజాలంలో ఊపిరాడక చస్తున్నా ప్రత్తిచేలో రొజుకో మట్టి సూరీడు అస్తమిస్తున్నా ప్రతిదినం హవాలా నామస్మరణంతో మా నైతిక విలువల దిగజారుడుతనాన్ని ప్రశ్నిచుకుంటున్నా వసంతాన్ని ఆహ్వానించడం మానం ప్రతి వసంతానికింత నమ్మకాన్ని కూర్చుకోడం మానం మాలో మేము కుంచించుకుపోతున్నా మమ్ము మేము వంచిచుకుంటున్నా పెరటి వేపచెట్టును వేరేవాడెవడో దోచుకుపోతున్నా వసంతాన్ని ఆహ్వానించడం మానం మా కలల ఖరీదు చందమామలోకి తొంగిచూడడం మా ఆశల విలువ నక్షత్రాల బరువు మా బ్రతుకు తంత్రులు తెగిపోతున్నా రేపటి రాగాలు పలికించడం తెలుసు మా ఆశలు ప...

వర్షం

చినుకు చినుకు చిరకాల మిత్రుని పిలుపులా చెవిని సోకి చిరుజల్లై నా హృదయ మైదానంలో వర్షించె చినుకు చినుకు ప్రియురాలి సుదీర్ఘ వియోగానంతర సమాగమంలా మదిన వసంతమై కోకిల గీతాలు పాడె చినుకు చినుకు ముక్కుపచ్చలారని బాల్యపు చివరి కేక కార్ఖానాల మసిబారిన గోడలలో కలిసినట్లు మనస్సు నిండా విషాదపు చీకట్లు క్రమ్మె --- మల్లవరపు ప్రభాకరరావు(1996)

నేను

నేను ప్రేమిస్తున్నపుడు ఎన్ని తపించే హృదయాలలో దాగాను విరహాల్ని, మోహాల్ని సుగంధాలుగా మార్చే సుందర దృశ్యాల్ని వీక్షించాను నేను దు:ఖిస్తున్నప్పుడు ఎంతమంది హృదయాలలో చలించాను వొక్క క్షణంలో ఎన్ని నిట్టూర్పుల హోరు విన్నాను నేను ద్వేషిస్తున్నప్పుడు ఎన్ని మండే గుందెల మీదుగా ఉరికాను ఎన్ని పర్వతాలనుంచో వెల్వడే విస్ఫోటనాల ప్రకంపనలు కన్నాను --- మల్లవరపు ప్రభాకరరావు(1996)

ఆవాహన

నా ఆగిపోని స్వప్నాల్ని నాలో ఆరని మోహాన్ని ఇదిగో ఇలా నీ క్రీగంటి చూపులో పారేసుకుని దివారాత్రాలు వెతకడం ఒకానొక పూర్తికాని పద్యపు వెలితితో హృదయాన్ని గుచ్చినట్లు నీ నవ్వీనవ్వని నవ్వు స్వప్న వాసవదత్తల మృగనయని మోహాల లోపల గిజ గిజ కొట్టుకుంటూ నాలో సడలే నిస్సంకోచాల వ్యాకోచాల నిర్మోహమాటాల రహస్య ద్వారాల గుండా సావిరహే శాకుంతలా సౌరభాల పుష్పించని బృందావన చీకటి వెతుకులాటలు రెప్ప వేయని కాలాన్ని స్వప్నిస్తూ గ్రాంఫోన్ గీతగోవిందాలు మడొన్నా దేహ విన్యాసాలు నిన్నటి క్లియోపాత్ర పిరమిడ్ ల అంతరంగ రహస్య ఆనవాళ్ళు దిశమొలతో ఆలింగనం కనిపించని దూరాన్ని కొలుస్తున్న క్షతగాత్రుడి ఎడారి గీతాల ఎడద నిండా పగిలిన గాజు శకలాల జ్ఞాపకాల ప్రాచీన ఏకాంత విహార యుద్ధాల ఆముష్మిక జీవన హేల --- మల్లవరపు ప్రభాకరరావు(2006)

స్వప్న సంగీతం

ఆకాశంపై మేఘాలు అలా… అలా అలలులా తుళ్ళుతూ తేలుతూ వెళ్తున్నాయి – నావైపు జాలిగా చూస్తూ చల్లని పిల్ల తుమ్మెర స్పృసిస్తూపోతుంది నా బాహువులను జోలపాడినట్లు చింతాక్రాంతుడ్ని ఓదార్చినట్లు.. నిశ్చల వాతావరణంలో నింగిపైని చుక్కలు,నా ప్రక్కన పిల్లతుమ్మెరల లాస్యం దూరాన చెట్లు గుసగుసలాడుకొంటున్నట్లు కదులుతూ మెరుస్తున్నాయి వెండిలా వెన్నెలతో కూడి రాత్రి గడిచేలాలేదు-స్వాప్నిక జగత్తు నుండి బయలువడి. మాటిమాటికీ మంచు తుంపరులొక్కక్కటే తడిపేస్తున్నాయి నా శరీరమంతా పొగమంచుకూడా ఆభరణమల్లే ప్రకృతికాంతకు నాకంటికి- ఎక్కడో అరుపులు విన్నట్లే గుర్తు ఎన్నో రాత్రులు వొంటరిగా మన్నుమిన్నుల మధ్య నాకేమో, గుడ్లగూబల అరుపులు కూడా సంగీతస్వరమై నిశ్శబ్దాన్ని చీలుస్తాయి అప్పుడప్పుడూ నా నిట్టూర్పులకు తోడుగా… ఏమైనా రాత్రి గడిచేలాలేదు స్వాప్నిక జగత్తునుండి విడివడి --- మల్లవరపు ప్రభాకరరావు (1990)

ఒకే క్షణం!

ఒకే క్షణం! నా వ్యధాభరిత గీతాల కలకలం అంతే! ఎక్కడనుంచో వో గొంతు తెగిన కోయిల ఆర్తనాదం తెగిన వీణ తంత్రిలా బొంగురుగా వినిపిస్తుంది పశ్చిమానకు మారిన సూర్యరశ్మితో పాటు అంతే! ఇక్కడ కలం కాయితాలతో మాటల గారడీ ప్రారంభమవుతుంది ఉషస్సుకై ఎదురు చూస్తూ --- మల్లవరపు ప్రభాకరరావు (1990)

పాఠం

కొంతమంది దగ్గరకు రాకూడదనేంత కసి వస్తే వెళ్ళిపొలేనంత వ్యధ గడప దగ్గరకు వచ్చేలోపల పదులసార్లు రావాలా!వద్దా! జంజాటాలు అడుగుపెట్టాలా! వెనక్కి కదలాలా సందిగ్ధ సందర్భాలు వోటమి ఎదురయ్యే క్షణాలుకోసం బహుశా ఎదురు చూపులు మినహా మరేమీ చేయలేని వెర్రితనం ఇదిగొ ఇక తప్పదన్నట్టు వోడిపోయిన చిర్నవ్వు మొహాన వేలాడేసుకుని మాయాదీపం సృష్టించిన జీనీ భూతంలా ప్రత్యక్ష్యమవుతాము వీళ్ళంటే ఎంత కసి పుడ్తుందో అప్పుడు పలకరించకుండా మొహం తిప్పుకోవడాలూ దగ్గరవుతున్నప్పుడు దూరమవడాలూ బొత్తిగా తెలీని పిల్లల్లా ఎదురుగా వచ్చి ఆలింగనం చేసుకుంటారు ఇక చూస్కో నాలోని నరాలు క్రుంగిపోయి నాలోని మనిషి వోడిపోయి నేను నిజమయిన నవ్వులు నాలుగు చిందించి నిజమయిన మాటలు నాలుగు పొంగించి నాలొ కల్మషాన్ని హుస్సేన్ సాగర్ మురికినాలాలోకి దొర్లించి క్షాళనాపర్యంతమవుతాను వీళ్ళెప్పుడూ ఇంతే! నేనీ జీవన వ్యాపారంలొ మునిగినప్పుడు గుప్పెడు జ్ఞాపకాల్ని బహుమానంగా ఇచ్చిపోతారు నేనీలోకాన్ని డేగకళ్ళతో వీక్షిస్తున్నప్పుడు వీళ్ళు పసిపిల్లల నవ్వులు చిందిస్తూ నాకొపాఠం చెబ్టున్నట్లుగా అనిపిస్తారు. ---- మల్లవరపు ప్రభాకరరావు 0...

మూలుగు

ఈ రూపాలు రంగులు మార్చుకుంటూ వంచనా శిల్పానికి అత్తర్లు అద్దుతున్నాయి వ్యధాభరిత గాధలన్నీ గతం తొక్కిన అడుసులై నిద్రలేని రాత్రుల నేపధ్యంలో దుఃఖాన్ని కావలించుకోవడమే **** ఈ దుఃఖాలన్నింటిని కావలించుకుని ఒక నిశ్శబ్దమైన రాత్రిలో చీకటి పడకను చేరుకుంటాను ఏముంది? నిరంతర పయనం తర్వాత ఒక శిలాజంలా కరిగిపోవటం తప్పించితే శబ్దాలన్నింటిని అరిగిపోయిన అక్షరాలుగ మార్చి విసిరేస్తే శవాలపై జల్లిన పూలు మాదిరే --- మల్లవరపు ప్రభాకరరావు (1990 )