కొత్త చూపునిచ్చే రోడ్ జర్నీసినిమా “North 24 Kaatham”

        


 

ప్రయాణం మనకో కొత్త చూపునిస్తుంది. మన లోచూపుని  విస్తరిస్తుంది. మన రోజువారీ జీవితంలో మన ఉద్యోగాలలో, పనులలో ఎక్కడో మనం తప్పిపోయినప్పుడు ఒక ప్రయాణం మనల్ని కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది. అందుకే రోడ్ మూవీస్ ని కాస్త ఎక్కువగానే చూస్తుంటాను. జీవితాన్ని అవి వ్యాఖ్యానించే పద్ధతి ఒక బైరాగి పదాలలాగా అనిపిస్తాయి. ఇప్పుడు కరోన సంక్షోభం కారణాన ఇంట్లోనే ఉండిపోయిన నాకు బయటివైపు చూడడానికి మలయాళ రోడ్ మూవీ నార్త్ 24 కాథమ్” (North 24 kaatham అంటే నార్త్ 24 మైల్స్)  సహాయం చేసింది. మలయాళంలో కాథమ్ అనేది దూరాన్ని తెలిపే పదం. ఒక కాథమ్ 16 కిలోమీటర్లకి సమానం. ఈ సినిమాలోని ప్రయాణం మొత్తం కేరళలోని దాదాపు అన్నిప్రదేశాల మీదుగా జరుగుతూ అంతకి మించిన జీవిత వ్యాఖ్యానం అందిస్తుంది.

 

 ఇర్ఫాన్ ఖాన్ మృతి విషాదంలో ఉన్నప్పుడు అనుకోకుండా నాకు ఫహద్ ఫాసిల్ గుర్తొచ్చాడు. దక్షిణాదిలో నటించడంతెలీని నటుడుగా నాకు బాగా ఇష్టమైన వ్యక్తి. ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో నటించిన నార్త్ 24 మైల్స్సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందిన ఒక అర్ధవంతమైన సినిమా. 2013 జాతీయ చలన చిత్ర బహుమతులలో ఈ సినిమాకి ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం అవార్డ్ దక్కింది. కేరళ ప్రభుత్వ ఇంకా అనేక సంస్థల అవార్డులనూ సొంతం చేసుకుంది. ఫహద్ ఫాసిల్ ఈ సినిమాకుగాను ఉత్తమ నటుడిగా కేరళ ప్రభుత్వ పురస్కారాన్ని పొందారు. 

సినిమా మొత్తం ముగ్గురు వ్యక్తులు అనుకోకుండా కలిసి ప్రయాణించవలిసి రావడంలో ప్రధాన పాత్రలో జరిగే ఒక introception, ఒక సంపూర్ణ పరివర్తనం గా చెప్పవచ్చు. 

 

ప్రధాన పాత్ర హరికృష్ణన్ (ఫహద్ ఫాసిల్) ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఉద్యోగి. వృత్తి పట్ల అతని అంకిత భావం తో పాటుగా  కంపెనీ విజయంలో అతని పాత్ర ప్రముఖంగా ఉండడంతో యజమాన్యం కూడా అతనికి తగిన గౌరవం ఇస్తుంది. అయితే హరికి ఉన్న శుభ్రతకి సంబంధించిన  అతిస్పృహకు ( obsessive compulsive disorder) తోడు స్వభావరీత్యా ముభావంగా ఉండే అతని ప్రవర్తన సహోద్యోగులలో అతనికి మంచి గుర్తింపు నివ్వలేకపోతుంది. ఒకరకంగా పరోక్షంలో అతని ఓ సి డీ వారికి వినోదాన్నిచ్చే వ్యవహారం అవుతుంది. కుటుంబంలో కూడా అతని కలవని మనస్తత్వం పరిశీలనకు గురవుతుంది. తరచుగా తన disorder గురించి డాక్టర్ ని కూడా కలుస్తుంటాడు. ఇంట్లో తన మనస్తత్వానికి పూర్తి వ్యతిరేకముగా అందరినీ ఆకట్టుకునే తమ్ముడి కలుపుగోలుతనం ఏమీ పట్టనట్టుగా కనిపించేయువతకు నమూనాగా ఉంటుంది. అతని శైలి కి తగ్గట్టుగా రేడియో జాకీ గా పనిచేస్తుంటాడు. 

 

హరి కంపెనీ పని మీద అతనికిష్టంలేని ప్రయాణం చేయాల్సివచ్చి ఒక రాత్రివేళ త్రివేండ్రంకు రైలు లో బయలుదేరతాడు. అతని కూపేలో ఒక వృద్ధుడి భార్యకి బాగాలేదని ఫోన్ కబురు రావడంతో ఆ వృద్ధుదు తరువాత స్టేషన్ లో దిగాల్సి వస్తుంది. అతనికి సహయంగా అదే కూపేలోని మరో యువతి నారాయణి ఆ వృద్ధునికి తోడుగా తన ప్రయాణాన్ని రద్దుచేసుకుంటుంది. రైలు దిగే హడావిడిలో వృద్ధుడి మొబైల్ ఫోన్ జారిపడుతుంది. ఆ ఫోన్ కి వచ్చిన సందేశాన్ని హరి అందుకుని బయట స్టేషన్ లో ఉన్న వృద్ధుడికి అందించాలని రైలుదిగి వెళ్తుండగా రైలు కదులుతుంది. లోపల హరి లగేజి ఉండిపోయిందన్న సాకుతో హరికూడా వారితోపాటు వృద్ధుడి ఊరు కోజికోడ్ వెళ్లడానికి సిద్ధమవుతాడు. ఒక పెద్దగా సహాయం చేయడానికి ఇష్టపడని వ్యక్తి, ఇతరుల అభిప్రాయాలను పట్టించుకొని వ్యక్తిగా ఉండే హరిలో ఆ వృద్ధుని పట్ల కలిగిన లోపలి చెమర్పు హరిలోని మరో మనిషికి ప్రారంభం లాంటిది.  ఆ సమయంలో కేరళ రాష్ట్రంలో బంద్ ఉండడం మూలాన ప్రజా రవాణా ఉండదు. ప్రయాణం అంతా తన గిరిగీసుకున్న నడత, చూస్తున్న వాస్తవాలలో ఒక ఘర్షణ కనపడుతూ ఉంటుంది. నడక, మోటార్ సైకిళ్ల మీద, చేపల పట్టే బొట్ల మీదుగా రకరకాలుగా సాగే ఈ ప్రయాణంలో హరి పొందిన అనుభవం, జీవితం పట్ల ఏర్పడిన ఒక నూతన  దృక్పధము సారాంశం. 

 

దర్శకుడు అనిల్ రాధాకృష్ణన్ మీనన్ తన మొదటి సినిమాగా బిగువైన కథనముతో అత్యంత ప్రతిభావంతంగా ఈ రోడ్ సినిమాని రూపొందించారు. కేరళలోని ప్రకృతి రమణీయకతని అందముగానూ, బంద్ సందర్భంలో కేరళ జీవిత వాస్తవాన్ని చాలా  గొప్పగా ఛాయాగ్రాహకుడు జయేష్ నాయర్ చిత్రీకరించగా, ఈ సినిమా మూడ్ ని పట్టివ్వడంలో సంగీత దర్శకుడు గోవింద్ మీనన్ సఫలీకృతులయ్యారు. ఇందులో కేరళ బంద్ జీవిత దృశ్యాల చిత్రీకరణ సత్య హిందీ సినిమాలో బొంబాయి నగర జీవితాన్ని చిత్రీకరించడానికి ఖాళీ సమయాల్లో ఛాయాగ్రహకుడు గెరార్డ్ హూపర్ కార్లో raw గా చిత్రీకరరించిన దృశ్యాలు గుర్తుకొస్తాయి.

 

వృద్ధుడైన రాజకీయ వేత్తగా నెడుముడి వేణు, ఎన్‌జి‌ఓ యువతిగా స్వాతిరెడ్డి పాత్రోచిత నటన సినిమాకు సహజత్వానిచ్చింది. సినిమా లో చాలా తక్కువ సంభాషణలు ముఖ్యంగా ప్రధాన పాత్ర హరికి ప్రయాణం నడుమ ఒక passive  పరిశీలకుడిగానే కనిపిస్తూ ఒక గొప్ప మార్పుకి లోనయ్యే క్షణాలన్నీ మాటలు లేని సంభాషణలే. ఫహద్ ఫాసిల్ మనల్ని వెంటాడతాడు.

.... మల్లవరపు ప్రభాకరరావు


Comments

Popular posts from this blog

అజాత శత్రువు

మధురకవి మల్లవరపు జాన్ గారి పై సాహీతీ కౌముది ప్రత్యేక సంచిక