పిల్లల భావోద్వేగాల ప్రపంచం “చిల్డ్రన్ ఆఫ్ హెవెన్”
ప్రపంచ వ్యాప్తంగా అర్ధవంతమైన సినిమా నిర్మాణపరముగా ఇరాన్ సినిమా
బాగా గుర్తింపు తెచ్చుకుంది. అనేక అంతర్జాతీయ సినిమా వేడుకల్లో ఇరాన్ సినిమా ఒక
చర్చనీయాంశమవుతూ విమర్శకుల ప్రశంసలందుకుంటూ వుంది. ముఖ్యంగా పిల్లల సినిమాకు
సంబంధించి ఇరాన్ సినిమా చాలా ఉన్నతమైన ప్రమాణాలు ఏర్పరిచింది. ఇరాన్ చిత్ర పరిశ్రమ
పిల్లలకు సంబంధించి తీసిన సినిమాలు పిల్లల సున్నితత్వాన్ని, వారి అనుబంధాలను, వారి బాల్యాన్ని మనముందు చాలా సరళం గా ఆవిష్కరిస్తాయి. మజీదీ మజీద్ ఇరాన్ సినిమాకు
సంబంధించి గొప్ప దర్శకుడు. 1997 లో అతను రూపొందించిన చిల్డ్రన్ ఆఫ్ హెవెన్(Children
of Heaven) సినిమా 1998 లో ఉత్తమ
విదేశీ చిత్రం కేటగిరీలో ఆస్కార్
అవార్డ్ కొరకు పోటీపడిన మొదటి ఇరాన్ సినిమా. ఈ దర్శకుడు తీసిన మరో సినిమా “ది సాంగ్ ఆఫ్ స్పారో” తో 2008 అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (విశాఖపట్నం)
ప్రారంభించారు.
“చిల్డ్రన్ ఆఫ్ హెవెన్” సినిమా
ఒక కుటుంబంలో తొమ్మిదేండ్ల అన్నకు ఏడేండ్ల చెల్లికి మధ్య పోగొట్టుకున్న బూట్ల
నేపధ్యంలో జరిగిన కథ. ఏ మాత్రం అసహజత్వం లేకుండా పిల్లల భావోద్వేగాలను, వాళ్ళ చిన్న ప్రపంచాన్ని కళ్ళకు కట్టించడంలో మజీదీ
మజీద్ మనల్ని ఇంకా పూర్తిగా కలుషితంకాని ఒకప్పటి మన బాల్యాన్ని గుర్తు చేస్తాడు.
సినిమా ప్రారంభంలో అలీ (అమీర్ ఫరూఖ్ హష్మెయిన్) తన చెల్లెలు జహ్రా (బహరే
సిద్దేకీ) బూట్లను బాగుచేయించి తర్వాత కిరాణా షాప్ కెళ్ళి బయట తన రొట్టెలు, బాగుచేపించిన బూట్లు వదిలి బంగాళా దుంపలను
కొనుగోలు చేస్తుంటాడు. ఈ లోపల చెత్త తీసుకుని వెళ్ళే బండి వ్యక్తి అక్కడ ఉన్న
చెత్తతో పాటుగా కవర్ లో పెట్టిన బూట్లను కూడా చెత్తగా భావించి తీసుకెళ్తాడు. అలీ
బయటకొచ్చి బూట్లు కనపడక వెతుకుతూ అక్కడి కూరగాయలు కింద పడిపోవడానికి కారణమవుతాడు.
దుకాణాదారు ఆగ్రహించడంతో ఇంటికొస్తాడు.
తన బూట్లు కోసం ఎదురు చూస్తున్న జహ్రాకు బూట్లు
పోయిన విషయం చెప్తాడు. అయితే ఈ విషయం తండ్రికి చెప్పవద్దంటాడు. తండ్రి తనని కొడతాదనే భయం కంటే తమ కుటుంబం ఉన్న
స్థితిలో కొత్త బూట్లు కొనడానికి తండ్రికి కష్టమని చెప్పి ఒక పరిష్కార మార్గాన్ని
సూచిస్తాడు. ఉదయం తన
స్నీకర్స్ ను జహ్రా వేసుకుని బడికి వెళ్తే మధ్యాహ్నం అలీ వెళ్ళేలా ఒప్పందం
కుదుర్చుకుంటారు. తరగతిలో అలీ చూపిన ప్రతిభకు బంగారు రంగు కలం బహుమతిగా వస్తే
దాన్ని జహ్రా కు ఇస్తాడు కొంతమేరకు బూట్లు పోగొట్టిన అసంతృప్తికి బదులుగా. ఈ
మధ్యలో ఒకరికొకరు షూ మార్చుకుని వెళ్లడంలో వరుసగా మూడుసార్లు బడికి ఆలస్యం గా వెళ్తాడు.
ప్రధానోపాధ్యాయుడు మొదటిసారి చూసీ చూడనట్లుగా వదిలివేసినా, రెండోసారి గట్టిగానే మందలిస్తాడు. మూడోసారి అలీ
నాన్నను తీసుకురమ్మంటాడు. అయితే అలీ తరగతి ఉపాధ్యాయుడు అలీ మంచి ప్రతిభగల
విద్యార్ధి అని
చెప్పి తో క్లాస్ కి అనుమతించేలా చేస్తాడు.
అలీ తండ్రి కుటుంబ అవసరాలు తీర్చడానికి మరింత
డబ్బు సంపాదించే నిమిత్తం తోటపని పరికరాలు అద్దెకు తెచ్చుకొని శివారు ప్రాంతాలలోని
ధనవంతుల ఇళ్ళ వద్ద పనికొరకు వెతుకుతుంటాడు. ఈ విషయంలో అలీ తన తండ్రికి సహాయపడుతుంటాడు. ఒక
విశాలమైన భవనంలో తోటపని దొరుకుతుంది. యజమాని మనమడు అలీరెజాతో అలీ ఆడుకుంటుంటే
తండ్రి తోట పని చేస్తుంటాడు. యజమాని ఉదారతతో కొంత ఎక్కువ ధనాన్ని ఇస్తాడు. దారిలో
అలీ తండ్రితో మాట్లాడుతూ జహ్రా బూట్లు బాగా పాడైనాయని కొత్తవి కొంటే బాగుంటుంది
అని తండ్రితో అంటాడు. దురదృష్టవశాత్తూ
బ్రేకులు పనిచేయక సైకిల్ పడిపోయి తండ్రికి గాయాలు అవుతాయి.
ఒకరోజు అలీ జహ్రా తో తను ఒక పరుగు పందెంలో
పాల్గొనడానికి ఎంపికైనానని అంటాడు. అందులో మూడవ బహుమతిగా స్నీకర్స్ అని అవి జహ్రా
కు ఇస్తానని అంటాడు. అయితే అనుకోకుండా పరుగు పందెంలో మొదటి వాడుగా వస్తాడు. తీవ్ర
నిరాశతో ఇంటికి వస్తాడు. జహ్రా కు తను జరిగిన విషయం చెప్పేలోపు తల్లి పిలుపుతో
లోపలికెళ్తుంది. తండ్రి సైకిల్ మీద ఇంటికి సంబంధించిన వస్తువులతో పాటుగా
పిల్లలిద్దరికీ కొత్త బూట్లు తీసుకురావడం చూపిస్తారు . అలీ తన చిరిగిపౌయిన
స్నీకర్స్ ను పడేసి బొబ్బలెక్కిన తన కాళ్ళను అక్కడున్న వాటర్ పూల్ లోకి ముంచడంతో
సినిమా ముగుస్తుంది.
చిన్న చిన్న సంఘటనలు ఎలా వీళ్ళ జీవితాల్లో
విషాదాన్ని నింపుతుందో, ఎలా
పరిష్కారాన్ని వెతుక్కుంటారో, చిన్న హృదయాలకి ఎవరు సహాయపడటారో, రోజువారీ కళలు, ఆశలు ఇవన్నీ చూస్తాం ఈ పిల్లల ప్రపంచంలో. ఒక
బూట్లు పోయిన సందర్భం ఎలా వీళ్ళ ప్రేమమయ జీవితాలకి ఆలంబనం అయింది, చిన్న నిరాశ, ఆదుర్దా, కొంచె అసహనం, అనుమానం, ధైర్యం వీళ్ళని ముందుకు నడిపిందీ ఈ సినిమాలో
చూస్తాం. పిల్లలు తమ దృక్కోణంలో జీవితాన్ని, సంఘటనలను చూడదాన్ని ఈ సినిమా మనకు పరిచయం
చేస్తుంది.
ఈ సినిమాలో కనిపించే దృశ్యాలన్నీ వాస్తవికమైనవే
అన్నట్లుగా అనిపిస్తాయి. ఆ దృశ్యాలతో మనమూ భాగమైపోతాము. చిత్రీకరణ కూడా చాలా
సరళంగా ఉంటూ సినిమాకు సంబంధించిన ఒక మూడ్ ని సృష్టిస్తుంది. తెహ్రాన్ నగర్
వాతావరణాన్ని స్వాభావికంగా చూపించడానికి తెహ్రాన్ నగరాన్ని రహస్యంగా
చిత్రీకరించారు.
ఈ సినిమాలోని ప్రధాన పిల్లల పాత్రధారులు అమీర్ ఫరూఖ్
హష్మెయిన్ అలీ పాత్రలో, జహ్రా గా
నటించిన బహరే సిద్దేకీ నటన ఎంత వాస్తవికంగా ఉందంటే వాళ్ళని చూస్తుంటే మన కళ్ల
ముందర నడిచిన పిల్లల్లాగా అనిపిస్తారు. ఆ పిల్లల ఆందోళన, బాధ్యత, అవమానం, పోరాటం అన్నీ కూడా పెద్దలకే కాదు పిల్లలికీ వాళ్ళ
స్థాయిలో ఈ లోకం పరిచయం అవుతుంది అని అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాలో తండ్రి పాత్ర, నిజంగా సజీవ పాత్ర. అందుకే ఈ సినిమా ఒక క్లాసిక్
గా నిలిచిపోయింది. దేశ దేశాల చలన చిత్రోత్సవాలలో ప్రదర్శించబడి ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలును సమానంగా పొందింది.
మల్లవరపు ప్రభాకరరావు, 9949996405
Comments