ఒక మహా జనాంగం వలస పోవడాన్ని తెలిపే కధనం “విష కన్య”
Migration is an expression of the human
aspiration for dignity, safety and a better future. It is part of the social
fabric, part of our very make-up as a human family.
___ Ban –ki-moon
ప్రపంచ నాగరికత అభివృద్ది లో ‘వలస’ కీలక పాత్ర వహించింది. ‘వలస’ మనిషి లోని ప్రగతి శీల భావనకు చిహ్నం. భవిష్యత్
జీవితం పట్ల ఒక ఆశను రేకెత్తించే ఒక ఉత్ప్రేరకం. మళయాళ సాహిత్యంలో ఒక గొప్పకధన
సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయాన్ని గొప్పకళగా పెంపొందింప జేసిన తగళి శివ శంకర్
పిళ్ళై, వక్క మహమ్మద్ బషీర్, పి.కేశవ్ దేవ్ లాంటి రచయతల వరుసలోని వ్యక్తి ఎస్.
కె. పొట్టెక్కాట్ రచించిన విషకన్యక (తెలుగులో విషకన్య) నవల మనిషి యొక్క మహా జీవన
ప్రయాణం.
శంకరన్ కుట్టి పొట్టెక్కాట్ 1913 మార్చి 13 న కాలికట్ లో జన్మించాడు. మొట్టమొదటిగా 1498 లో పోర్చుగీసు వారు అడుగుపెట్టిన జామోరిన్ల రాజధాని ఈ కాలికట్
పట్టణం. అప్పటికే అరబ్బులు వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉండగా కొత్తగా వచ్చిన
పోర్చుగీసులు , స్థానికులతో వైరం , పోరాటాలుతో ప్రాచీనత సంతరించుకున్న ఈ పట్టణం లోని ప్రదేశాలు, ఈ పట్టణాన్ని ఆవరించుకున్న కథలు, కాల్పనిక గాధలు పొట్టెక్కాట్ ను ఎంతో ప్రభావితం
చేసాయి. ఇవన్నీ పొట్టెక్కాట్ లోని సృజనకారుని, యాత్రికుని మేల్కొలిపాయి. తను తిరిగిన ప్రాంతం, తను చూసిన విశేషాలు, విన్న కథలు అతని రచనలలో భాగమైపోయాయి.
ప్రారంభంలో అధ్యాపకునిగా రెండేండ్లు (1937-39 ) పనిచేసినా దేశభక్తి ప్రేరితుడై త్రిపురి కాంగ్రెస్
సమావేశాలలో పాల్గొనడం, తద్వారా ఉన్న ఉద్యోగానికి
తిలోదకాలు ఇవ్వ వలిసి వచ్చింది. తర్వాత జీవికకై అనేక ఉద్యోగాలు చేసినా ఇవేవీ తన
సృజనాత్మక జీవితానికి తోడ్పడవని భావించి 1945 లో బొంబాయి నుండి కేరళకు తిరిగి వచ్చాడు. తర్వాత కేవలం రచననే
వృత్తిగా స్వీకరించాడు. తన జీవిత కాలంలో 60 కి పైగా పుస్తకాలు ప్రచురింపబడ్డాయి. పది నవలలు, ఇరవై నాలుగు కథానికా సంకలనాలు, మూడు కవితా సంపుటాలు, పద్దెనిమిది
యాత్రా విశేషాల రచనలు, నాలుగు నాటకాలు, వ్యాసాలు, స్వీయ స్మృతుల ఆధారిత రచనలు వెలువడ్డాయి. వీరు రచించిన “ఒరు తెరువింటే కథ” (ఒక వీధి కథ) కు 1972 లో కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు లభించింది. ఇక 1981 లో సాహిత్యంలో అత్యున్నత జ్ఞాన పీఠ పురస్కారం వీరి “ఒరు దేశంతింటె కథ” (ఒక
ప్రాంతం కథ) కి లభించింది. 1962 లో పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందాడు. వీరు 1982 ఆగష్టు 6 వ తేదీన మరణించారు.
ఎస్.కె.పొట్టెక్కాట్ గొప్ప యాత్రికుడు. అతని
యాత్రలన్నీ ఒక్క పశ్చిమ యూరోప్ ప్రయాణం మినహాయించి మిగిలినవన్నీ అతని
వ్యక్తిగతమయినవే. అందుకే అన్ని యాత్రా విశేషాల రచనలు చేయగలిగాడు. దేశవిదేశాలలో
విస్తృతంగా పర్యటించాడు. అవన్నీ ఆసక్తికర కథనాలుగా పాఠకుల ప్రసంసలందుకున్నాయి. ఈ
యాత్రా స్వభావమే అతని విషకన్య నవల సృజనకు కారణమైంది. 1944 ప్రాంతాల్లో మలబారు కొండల ప్రాంతాల్లో గడిపినప్పుడు తిరువాన్కూరు
నుండి ప్రధమంగా వలస వచ్చిన వారి గురించి తెలుసుకోవడం, వారితో పరిచయం వారి సాహసోపేత ప్రయత్నాలు
పొట్టెక్కాట్ చే ఈ నవల రాయించింది.
ఒక గొప్ప భవిష్యత్ పట్ల ఆశతో, విశ్వాసంతో, తాము ఉన్న ప్రాంతాన్ని వదిలి, లక్షలాది నిమ్న జాతి క్రైస్తవ జన సమూహం ట్రావెంకూర్ నుండి మలబారు
కొండల వైపుకు సాగించిన మహా జీవన ప్రయాణాన్ని విషకన్య చిత్రిస్తుంది. ఈ ప్రయత్నంలో
వారు తమ ధనాన్ని, చెమటను ధారపోశారు. కొత్తగా
వచ్చిన ఈ ప్రజలు మలబారు ప్రాంతంలోని కొండలు, అడవులు, లోయల్ని తమ స్వేదంతో పంట
పొలాలుగా మార్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి కేరళ స్వావలంబనకు ఈ మొదటి తరం
చేసిన మొక్కవోని కృషి, త్యాగాలే కారణమని
చెప్పొచ్చు.
భారత దేశానికి స్వాతంత్ర్యం రాకముందు ఇప్పటి కేరళ
ప్రాంతం మూడు భాగాలుగా విభజితమైంది. ఉత్తరాన మలబారు ప్రాంతం, దక్షిణాన తిరువాన్కూరు సంస్థానాలు ఉండేవి. మధ్యలో
కొచ్చిన్ సంస్థానం ఉండేది. వీటిలో మలబారు ప్రాంతం బ్రిటీష్ వారి పాలనలో మద్రాస్
ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. తిరువాన్కూర్ సంస్థానపు ప్రధాన మంత్రి సర్
సి.పి.రామస్వామి అయ్యర్ అణిచివేత విధానాలతో అక్కడి క్రైస్తవ జనాంగం ఉత్తర మలబారు
కొండల ప్రాంతాల్లోని సారవంతమైన వ్యవసాయ భూముల పట్ల ఆశతో, ఆత్మ గౌరవంతో బ్రతకవచ్చుననే భరోసాతో తమ ఆస్తులని అమ్ముకుని, సమూహాలుగా, అలలు అలలుగా వలస సాగిస్తారు. అప్పటివరకు సాగుచేయని ఆ మనోహర భూములు వారిని
ఆకర్షించి వారి ఆశలకు రూపం కల్పిస్తుంది. తమ స్వేదంతో అడవుల్ని కొట్టి, కొండల్ని తవ్వి అప్పటివరకు ఉనికిలోకి రాని భూమిని
సాగుచేసి తమ భవిష్యత్తుని కలగంటారు. ఈ మొదటి తరం వలస దారులు అంత్యంత కఠోర
పరిస్థితులు ఎదుర్కొంటారు. అడవుల్లోనే తమ గుడిసెలు వేసుకుని, బావులు తవ్వుకుని, గట్లు నిర్మించుకుని కర్ర పెండెలం , సుగంధ ద్రవ్యాల పంటలు ఇంకా అనేక రకాల పంటలు పండిస్తారు. అయితే వీరి
శ్రమ అడవి పందుల పాలౌతుంది. ఆ అడవి ప్రాంతాల్లో వ్యాపించిన మలేరియ వ్యాధి మూలంగా
అనేక మంది ప్రాణాలు కోల్పోగా మిగిలిన అన్నీ కోల్పోయిన వారు నిస్త్రాణమై
ట్రావెంకూర్ కు ప్రయాణమౌతారు. తమను ఆకర్షించి ఆశలు రేపి మాధుర్యాన్ని నింపిన ఆ
సుందర మనోహర భూమి విష కన్యయై వారిని హతమారుస్తుంది.
నవల ప్రారంభంలో వర్కీ అనే వ్యక్తి నాయకత్వంలో ఇరవై
ఐదు మంది వ్యక్తుల సమూహం మలబారుకు వెళ్ళడానికి సన్నద్ధం కావడంతో ప్రారంభం అవుతుంది.
చివరి అధ్యాయంలో అంతోనీ, మార్టిన్ అనే వ్యక్తులు
మలబారు ప్రాంతం నుండి ట్రావెంకూర్ కి తిరిగి వస్తూండడంతో ముగుస్తుంది.
ఈ నవలలో అనేక పాత్రలు వర్కీ, చెరియన్ , అతని భార్య మరియమ్మ చెరియన్ కొడుకు జాన్, ,మత్తయి, పోతక్యం వర్గీస్, మార్టిన్, భార్య మరియమ్మ, కుమార్తె మేరీ కుట్టి, కుమారుడు జాన్,వరీత
కుంజీ, మాధవి మోహించిన అంతోనీ, అంతోనీ ఆరాధించిన ఆనీ కుట్టి ఇంకా అనేక పాత్రలు, వారి జీవితాలు వేటికవే వేరుగానూ ఎవరూ ప్రత్యేకించి
కథానాయకుడిగా లేకుండా ప్రతి ఒక్క పాత్ర తమ స్వంత జీవితాన్ని కలిగి మొత్తంగా ఈ
మహోన్నత వలస జీవిత ప్రతిబింబంగా కనిపిస్తుంది. నవలలోని ప్రతి పాత్ర తమదైన ఆత్మను
కలిగి కథను ముందుకు నడిపే చోదకుడవుతాడు.
జమీందార్ గుమస్తా కుంజిప నంబియార్ చెల్లెలు మాధవి మలబారు కొండల సౌందర్యాన్ని తనలో నింపుకున్న
స్త్రీ. ఆధ్యాత్మికంగాను, నైతికంగానూ స్వీయ క్రమశిక్షణ, పాటిస్తూ జీవించే ఆంధోనీ పై మోహంతో అతనిని వశపరుచుకోవాలనే కాంక్షతో
తరుచుగా అతని వద్దకు వెళ్ళడం, ఒకరాత్రి
ఆమె మోహంలో ఆంధోనీ కరిగిపోవడం జరుగుతుంది. అది నైతిక పతనం గా భావించి
ఆధ్యాత్మికంగా శిధిలమైనానని కుంగిపోతాడు ఆంధోనీ. ఒకరకంగా ఇక్కడ మాధవి విషకన్యకు
ప్రతీక.
వలస వచ్చిన ప్రజలుకు భూముల్ని అమ్మే జమీందారులు, వారి గుమాస్తాలు, ఏజెంట్లు; ఆత్మవిశ్వాసంతో భూముల్ని
కొన్న కొంతమంది చివరికి అన్నీ కోల్పోయి దారి ఖర్చులకు తిరిగి అవే భూముల్ని అమ్మడం, లక్షలాదిగా వచ్చిన నిమ్న జాతి క్రైస్తవ సమూహం పట్ల
స్థానికుల చిన్న చూపు, అనుమానాలు, వలస వచ్చిన వారి ఆచారాలు, బలహీనతలు, వారితో పాటుగా వ్యాపించిన చర్చిలు, స్థానికులతో వలస వచ్చినవారి ఘర్షణలు అన్నీ ఈ నవలలో చిత్రిస్తాడు
రచయత. ఒ.యన్.వి.కురుప్పు ఈ నవలకు ముందు మాట రాస్తూ “పొట్టెక్కాట్
ఈ నవలలో మానవుడు-ప్రకృతి కీ మధ్య జరిగిన సంఘర్షణ-కలయికలో గల మాధుర్యాన్ని కావ్యాత్మకంగా
నాటకీయ శైలిలో ఆవిష్కరించారు. ఆ వన్య ప్రకృతి ఒకవైపు తన సహజమైన సౌందర్యాన్ని
ప్రదర్శించి ప్రజలను తనవైపు ఆకర్షిస్తూ మరోవైపు పాప పంకిలమైన కౌగిట బిగించి
హతమారుస్తోంది” అంటారు. శ్రీ పి.వి.నరసారెడ్డి గారు సుందరంగా
తెనిగించిన విషకన్య తెలుగు అనువాదాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించారు.
మల్లవరపు ప్రభాకరరావు
9949996405
Comments