నిరాడంబర జీవన సౌందర్యం “సాంగ్ ఆఫ్ స్పారోస్”
ఆధునిక ప్రపంచంలో మనిషి మనుగడ నిరాడంబరంగా
జీవించడంలోనే ఉందనే తాత్వికతను ఇరాన్ సినిమా “సాంగ్ ఆఫ్ స్పారోస్” మనకు చెప్తోంది. ప్రముఖ ఇరాన్ దర్శకుడు మజీదీ మజీద్ 2008 లో తీసిన ఈ సినిమా అతని ఇతర సినిమాల్లాగే
ప్రేక్షకుల మరియు విమర్శకుల ప్రశంసలందుకుంది. అంతర్జాతీయ సినిమా వేడుకల్లో ప్రదర్శించబడి అవార్డులనూ
గెలుచుకుంది. 2008 లో ఆస్కార్ అవార్డుల కొరకు ఉత్తమ విదేశీ చిత్రం
కొరకు ఇరాన్ నుంచి అధికార ఎంట్రీ గా ఈ సినిమా ఎంపికైంది.
మజీద్ సినిమాలలో
జీవితంలోని సాధారణ సంఘటనలను కధా వస్తువుగా తీసుకుని వాటిని కళాత్మకంగా
వ్యాఖ్యానించడం కనిపిస్తుంది. ఇరాన్ రాజధాని టెహరాన్ కి దూరంగా ఉండే
గ్రామం లో నివసించే కరీం, అతని కుటుంబం, పరిసరాలు, విధానమైన అతని ఎదుర్కొన్న సంఘటనలు నేపధ్యంగా ఈ సినిమాను తెరకెక్కించాడు.
కరీం (రెజా నజీ) తన భార్య నర్గీస్ (మర్యం అక్బరీ) ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి నివసిస్తుంటాడు. తన కుటుంబం పట్ల అత్యంత ప్రేమ కలిగిన
మామూలు వ్యక్తి కరీం. తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఒక ఆస్ట్రిచ్ పెంపక కేంద్రంలో
సంరక్షకుడిగా ఉంటాడు. ఒకరోజు పక్షుల పెంపక కేంద్రం నుంచి ఇంటికొచ్చేప్పటికి మురుగు కాలవకు
సంబంధించిన ఒక గుంటలో పిల్లలందరూ కలిసి అతని కుమార్తె వినికిడి యంత్రాన్ని
వెతుకుతుంటారు. ముందు పిల్లల్ని అరిచినా తను కూడా అందులో
దిగి వెతుకుతాడు. అతని కొడుకు హుస్సేన్ వాడి మిత్రులు కలిసి ఆ గుంటను శుభ్రం చేసి
అందులో గోల్డ్ ఫిష్ పెంచి డబ్బు సంపాదించాలనే మాటల్ని కసురుకుంటాడు. చివరికి దొరికిన ఆ మిషన్ ని కడిగి
శుభ్రం చేసి చూస్తే అది పని చేయదు. కుమార్తెకి పరీక్షల నేపథ్యంలో అది అవసరం.
ఒకరోజు కొత్తగా
వచ్చిన ఆస్ట్రిచ్ పక్షులను లోపలికి తెచ్చే క్రమంలో ఒక పక్షి తప్పించుకు పోతుంది. దీనితో కరీం ఉద్యోగం ఊడుతుంది. తన కుమార్తె హియరింగ్ మిషన్ ను బాగు
చేయించడానికి టెహ్రాన్ వెళ్లడంతో అతని జీవితం కొత్త మలుపు తీసుకుంటుంది. అతనిని టు వీలర్ టాక్సీ డ్రైవరుగా
పొరబడి అతని సేవలను వినియోగించుకుంటారు. దీనితో అతనికో ఉపాధి దొరకడంతో క్రొత్త జీవితం ప్రారంభమవుతుంది. ఈ క్రమములో అతని జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. నగరంలో రద్దీ జీవితంలో అతనికి తారసపడే
రకరకాల మనుషులు, మంచీ చెడూ, వినిమయ ప్రపంచము అతనిలో స్వార్ధపరత్వాన్ని పెంచుతుంది. టెహరాన్ నుంచి తన గ్రామానికి తిరిగి
వచ్చేప్పుడు పాత వినిమయ వస్తువులను కొని తీసుకొస్తుంటాడు. నెమ్మదిగా అతనిలో ఇంతకుముందటి ఇరుగు
పొరుగుతో ఉండే సంబంధాలలో కూడా మార్పు వస్తుంది.
ఈ క్రమంలో తను
సేకరించిన పాత వస్తువుల మధ్య ప్రమాదం సంభవించి కాలుకు కు గాయమయ్యి ఇంట్లోనే ఉండాల్సొస్తుంది. తను మంచం మీద ఉన్నప్పుడు తన భార్య, తన పొరుగువారు చూపిన దయ, వారు తమ కుటుంబానికి సహకరించడం చూసి అతనిలో నెమ్మదిగా పరివర్తన ప్రారంభం అవుతుంది. ఈ మధ్య కాలంలో పిల్లలు గోల్డ్ ఫిష్ ని
పెంచి అమ్మే కాలానికి అవి నిలవ వుంచిన టాంక్ పగిలి గోల్డ్ ఫిష్ నేల పాలవుతాయి. అవి చనిపోకుండా వాటిని పక్కనే ఉన్న
కాలవలోకి తన కుమారుడు నెట్టేయడాన్ని చూసి ఆనందిస్తాడు. ఈ లోపు తప్పించుకున్న ఆస్ట్రిచ్
దొరకడంతో అతని ఉద్యోగం కూడా తిరిగి లభిస్తుంది. తన ఇంటిలో చిక్కిపోయిన పిచ్చుకని
తలుపు తీసి బయటకు వెళ్ళేలా చేయడంతో అతనిలో మార్పును కూడా సూచిస్తూ సినిమా
ముగుస్తుంది. ఒక రకంగా అతని ప్రాకృతిక ప్రపంచాన్ని తిరిగి చేరినట్లవుతుంది.
స్థూలంగా కధ ఇదే
అయినప్పటికి మజీద్ సినిమా గా మలిచిన తీరు మనల్ని ఆకట్టుకొంటుంది. టెహరాన్ కు దూరంగా ఉన్న ప్రాంతాల
నిసర్గ సౌందర్యాన్ని, ఆ ప్రాంతంలో నివసించే కుటుంబాల సాధారణ
జీవితాన్ని పరిచయం చేస్తాడు. తర్వాత కాలములో టెహరాన్ నగర వేగవంతమైన జీవితం, వినిమయ ప్రపంచపు మరో రూపాన్ని పరిచయం చేస్తాడు. సినిమాటోగ్రాఫర్ తూరాజ్ మన్సౌరి
గొప్పగా ఈ వైరుధ్యాలను తన కెమెరాతో ఒడిసి పట్టుకుంటే హోసేమ్ అలీజా తన సంగీతం తో వాటికి
గొంతునిచ్చాడు. తను తెచ్చిన పాత నీలి రంగు తలుపుని
భార్య నర్గెస్ పక్క కుటుంబానికి ఇస్తే వెళ్ళి తిరిగి తీసుకొచ్చే క్రమంలో కనిపించే
దృశ్యం గొప్పగా చిత్రీకరించారు. విశాలముగా ఉన్న పొలాల మధ్య వీపుమీద తలుపు మోస్తూ కరీం తన ఇంటికి
వస్తూ ఉంటాడు. ఎవరూ కనిపించని నేపథ్యంలో అతనిలో పెరిగిన స్వార్థాన్ని చూపడానికి
తీసిన ఒక అధివాస్తవిక షాట్ లాగా
అనిపిస్తుంది. నేపథ్య సంగీతం కూడా మనల్ని కట్టిపడేసేలా చేస్తుంది.
సినిమా మొత్తం
మనల్ని కరీమ్ పాత్ర కట్టిపడేస్తుంది. కుటుంబ పెద్దగా అతని బాధ్యత, ఒకదాని వెంట ఒకటి అతనికి కష్టాలు సంభవించడం, వాటిని ఎదుర్కోవడంలో అతడు చూపే ఓర్పు
మనల్ని మనం ఎక్కడో చూసుకున్నట్లే ఉంటుంది. ఆస్ట్రిచ్ తప్పించుకున్నప్పుడు ఆ కొండ ప్రాంతాల్లో దానిని
కనిపెట్టడానికి అతడు ఆస్ట్రిచ్ లా వేషం వేసుకుని వెతకడం మనకు నవ్వు పుట్టించినా
వెంటనే ఒక నిట్టూర్పుకి లోనవుతాము. అప్పటి వరకు తనలో ఇమిడిపో పొయిన సాంస్కృతిక మూలాలకు భిన్నంగా ఒక్కసారిగా టెహరాన్ నగర ప్రాంత సంస్క్రతిలో ఇమడని ఒక సంక్షోభాన్ని
తన నటనద్వారా అద్భుతంగా ప్రదర్శిస్తాడు. కరీం గా నటించిన రెజా నజీ గొప్ప ప్రశంసలు పొందడమే కాకుండా ఉత్తమ
నటుడిగా అనేక అంతర్జాతీయ అవార్డులనూ పొందాడు ఈ పాత్ర ద్వారా. ఇతర పాత్రలు పిల్లల్తో సహా అవన్నీ మన
మధ్య సహజముగా తిరుగుతున్నట్లుగా అనిపిస్తాయి. ఎక్కడా “నటించకుండా” కనిపిస్తాయి.
మజీద్ సినిమాలన్నీ
మనిషి పట్ల దయ, వాళ్ళ వైఫల్యాలపట్ల ఒక సానుభూతిని
కలిగించే ప్రయత్నం చేస్తాయి. మన రోజువారీ జీవితాలలో మనం ఇతరులతో వ్యవహరించాల్సిన తీరును గుర్తు
చేస్తాయి. మజీదే అన్నట్లు ఆధునికత మనిషిని
ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. రోజు రోజుకీ కురచయిపోతున్న స్నేహం, నైతికత, సౌందర్యము మొదలైన మానవీయ విలువలు ను
తిరిగి పొందాలన్నదే తన సినిమాల ఉద్దేశ్యం అని అప్పుడే మనిషి తన మానవత్వాన్ని
నిలుపుకోగలదు అని అంటాడు.
మల్లవరపు ప్రభాకరరావు
Comments