బహుముఖ ప్రజ్ఞాశాలి గిరీష్ కర్నాడ్

 




 ప్రముఖ నాటక రచయత పద్మ భూషణ్ గిరీష్ కర్నాడ్ మృతి (జూన్ 10) చెందడంతో భారతదేశం ఒక గొప్ప సాహితీ వేత్తను కోల్పోయినట్లైంది. సాహిత్యం, సినీ రంగాలలోను అత్యున్నత ప్రతిభ చూపిన ఆయన ప్రభావం అపారమైనది.

 

2.  గిరీష్ రఘునాథ్ కర్నాడ్ అప్పటి బాంబే ప్రెసిడెన్సి లోని మాధేరన్ ప్రాంతంలో మే 19, 1938 లో జన్మించారు. యువకుడిగా ఉన్నప్పుడు యక్ష గానం పట్ల, నాటక రంగం పట్ల  ఆకర్షితుడయ్యారు. 1958 లో కర్ణాటక ఆర్ట్స్ కాలేజీ, ధార్వాడ్ నుంచి గణితం, సాంఖ్యక శాస్త్రాలలో డిగ్రీ ని పొందాడు. పిమ్మట ఉన్నత విద్యను రోడ్స్ స్కాలర్ షిప్ పొంది ఆక్స్ ఫోర్డ్ నుంచి ఫిలాసఫి, రాజనీతి శాస్త్రం, ఆర్ధిక శాస్త్ర విభాగాల్లో యెమ్.ఏ పట్టాను పొందాడు. అక్కడే ఆక్స్ ఫోర్డ్ యూనియన్ ప్రెసిడెంట్ గాను ఎన్నికయ్యారు. భారత దేశానికి తిరిగి వచ్చాక మద్రాస్ లోని ఆక్స్ ఫోర్డ్ యునివర్సిటి ప్రెస్ లో చేరారు. ఆ సమయంలోనే డా. సరస్వతీ గణపతి తో పరిచయం ఏర్పడింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత వారు వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానము. తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా రచనా వ్యాసంగానికే అంకితమయ్యారు. మద్రాస్ లో ఉన్నప్పుడే స్థానిక రంగస్థల గ్రూప్ మద్రాస్ ప్లేయర్స్ తో కలిసి పని చేయడం జరిగింది. అక్కడే మన పట్టాభి గారితో పరిచయం కన్నడ సాహిత్యం లో సంచలనాత్మక నవల యు.ఆర్. అనంత మూర్తి సంస్కార ను సినిమాగా తీయాలనే ఆలోచన కలిగింది. పట్టాభి తో కలిసి సినిమాకు స్క్రీన్ ప్లే అందించడం జరిగింది. ఒక ప్రధాన పాత్ర (ప్రాణేసాచార్య) లో నటించారు. 1970 లో విడుదలైన ఈ సినిమా జాతీయ ఉత్తమ చిత్రం గా బహుమతి పొందింది. ఒక కన్నడ సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా బహుమతి గెలుచుకోవడం ఇదే ప్రధమం. మరొక ముఖ్య విషయం ఈ చిత్రంలోని ప్రధాన స్త్రీ పాత్రను పట్టాభి భార్య  స్నేహలత రెడ్డి పోషించారు.

3.    నాటక రచయతగా మొదటి నాటకం యయాతి (1961) ని  23ఏళ్ల వయసులో రచించారు. అప్పటికి కన్నడ సాహిత్య రంగం పూర్తిగా పాశ్చాత్య ప్రభావంతో స్థానిక స్పృహ ను కోల్పోయి పరాయీకరణ చెందుతున్న కాలంలో ఈ నాటకాన్ని మానవ జీవితంలోని   సంవేదనల్ని మహాభారతంలోని పాత్రల ద్వారా ప్రకటించాడు. అద్భుత విజయాన్ని సాధించిన ఈ నాటకం భారతీయ భాషలలోకి అనువదించబడి ప్రదర్శించడం జరిగింది.

4.            గిరీష్ కర్నాడ్ తన నాటకాల ద్వారా ఒక నూతన దృక్పధాన్ని ప్రవేశ పెట్టాడు. చారిత్రక, పౌరాణిక వస్తువును స్వీకరించి వాటిని వర్తమానాంశాలకు అన్వయిస్తూ విభిన్న పాత్రలతో వారి మనస్తత్వ, తాత్విక సంఘర్షణను చిత్రించడం ద్వారా  ఆధునిక మానవుని అస్తిత్వ సంక్షోభాన్ని ఆవిష్కరిస్తాడు. తర్వాత తన 26 ఏళ్ళకు రాసిన నాటకము  తుగ్లక్ . 14 వ శతాబ్దికి చెందిన విఫల ఆదర్శవాది మహమ్మద్ బిన్ తుగ్లక్ జీవితానికి చెందినది. ఒక గొప్ప ఆదర్శవాది ఆదర్శాలు ఎలా ప్రారంభమై ఎలా క్షీణించాయో నెహ్రూ యుగాన్ని అన్యాపదేశంగా గుర్తు చేస్తూ చెప్తాడు. అలానే 11వ శతాబ్దికి చెందిన కధా సరిత్సాగరం నుంచి తీసుకున్న హయవదన (1971). దీనిలో యక్ష గాన ప్రక్రియను చొప్పించాడు. తలె దండ (1990) నాటకం ను 12 వ శతాబ్దికి సంబంధించి వీర శైవ ఉద్యమ నేపధ్యంలో ఆధునిక అనువర్తనము గా చూడవచ్చు.

     గిరీష్ కర్నాడ్ నాటకాలన్నీ దేశ విదేశాలలో ప్రముఖులచే ప్రదర్శించబడి గొప్ప ప్రశంసలందుకొన్నవి. వీరి సాహిత్య కృషికి గుర్తింపుగా సంగీత నాటక అకాడెమీ అవార్డ్ (1972) , కన్నడ సాహిత్య పరిషత్తు అవార్డ్ (1992) , సాహిత్య అకాడెమీ పురస్కారం (1994) లతో పాటు సాహిత్యంలో అత్యున్నత అవార్డ్ జ్నాన్ పీఠ్ అవార్డ్ (1998) లభించాయి. భారత్ దేశపు పౌర పురస్కారాలైన పద్మ శ్రీ (1974), పద్మ భూషణ్ (1992) లు వీరి సాహిత్య కృషికి గుర్తింపుగా లభించాయి. యునివర్సిటి ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్ వారు గౌరవ డాక్టరేట్ ను బహుకరించారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కు, లండన్ లోని నెహ్రూ సెంటర్ కు  డైరెక్టర్ గాను, సంగీత నాటక అకాడెమీ కు ఛైర్మన్ గాను సేవలందించారు.

6. సాహిత్యము , సినీ రంగాలలో సమానమైన అత్యున్నత ప్రతిభ ప్రదర్శించడం గిరీష్ కర్నాడ్ కే చెల్లింది. అనేక సినిమాలకు దర్శకత్వం వహించడం, స్క్రీన్-ప్లే లు అందించడం, నటునిగా ఉన్నతంగా రాణించడం గిరీష్ కర్నాడ్ కే చెల్లింది. వీరి సినిమాలకు అనేక అవార్డులు లభించాయి. 1971లో దర్శకునిగా మొదటి సినిమా వంశ వృక్ష ను ఎస్.ఎల్.బైరప్ప కధ ఆధారంగా రూపొందించారు. దీనికి జాతీయ స్ధాయి లో ఉత్తమ దర్శకుని అవార్డ్ లభించింది. ఈ చిత్రం ఆధారంగా బాపు వంశ వృక్షం ను రీమేక్ చేశారు. మృచ్చ కటికం ఆధారంగా రూపొందించిన హిందీ సినిమా ఉత్సవ్ గొప్ప క్లాసిక్ గా నిలిచింది. క్రీ.శ 4 వ శతాబ్దికి చెందిన ఈ కధను చాలా రమ్యంగా చిత్రీకరించడం జరిగింది., సినిమా రంగంలో వీరు ఏడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, పది జాతీయ అవార్డులు అందుకున్నారు. తెలుగులో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఆనంద భైరవి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. తెలుగులో కొమరం పులి, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ లాంటి సినిమాల ద్వారా, ప్రేమికుడు లాంటి అనువాద చిత్రాల ద్వారా నటునిగా తెలుగు ప్రేక్షకులను అలరించారు. అనేక డాక్యుమెంటరీలు రూపొందించారు.

7.    దూరదర్శన్ లో ప్రతి వారమూ ప్రసారమయ్యే టర్నింగ్ పాయింట్ ను శాస్త్రవేత్త యష్ పాల్ తో కలిసి రూపొందించారు. ఇందులో వారిరువురు సైన్స్ లోని సంక్లిష్ట విషయాలను సులహ శైలిలో  సామాన్య ప్రేక్షకులకు అర్ధమయ్యేలా అందించారు. అలాగే ఆర్.కె. నారాయణ్ మాల్గుడి డేస్ ఆధారంగా శంకర్ నాగ్ దర్శకత్వంలో రూపొందించిన మాల్గుడి డేస్ లో నటించారు. భారత రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్ కలామ్ ఆత్మకథ  వింగ్స్ ఆఫ్ ఫైర్ ఆడియో బుక్ కి స్వరాన్ని అందించారు.

8.    అనేక ప్రజాస్వామిక ఉద్యమాలకు గళమిచ్చారు. హిందుత్వ రాజకీయాలను వ్యతిరేకించేవారు. గౌరీ లంకేష్ హత్య కేసు నిందితులు తమ హిట్ లిస్ట్ లోని 33 మంది వ్యక్తుల జాబితాలో గిరీష్ కర్నాడ్  కూడా ఒకరు అని విచారణ లో తెలిపారు. అస్వస్థులుగా ఉన్నప్పటికీ పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్ ధరించి కూడా విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా నిరసన తెలపదంలో ముందున్నారు. ఆధునిక నాటక సాహిత్య రంగంలో తనదంటూ ముద్ర వేసిన పద్మ భూషణ్, జ్నాన్ పీఠ్ అవార్డ్ గ్రహీత గిరీష్ రఘునాథ్ కర్నాడ్ (1938-2019) సాహితీ యవనికనుంచి నిష్క్రమించడం సాహిత్య, సినీ రంగాలకు ఒక లోటు.

                                                                                                                                                 మల్లవరపు ప్రభాకరరావు

 

Comments

Popular posts from this blog

అజాత శత్రువు

మధురకవి మల్లవరపు జాన్ గారి పై సాహీతీ కౌముది ప్రత్యేక సంచిక