జిబ్రాన్ తాత్త్విక సంవేదన బెందాళం కవితానువాదం “ప్రవక్త”

 





 

బెందాళం కృష్ణారావు గారు ప్రముఖ పాత్రికేయులు. అనేక పత్రికలలో పనిచేసారు. చాలా పత్రికలకు ఫీచర్స్ రాస్తుంటారు. పాత్రికేయ వృత్తికి సంబంధించి మీరే జర్నలిస్ట్ లాంటి పుస్తకాలు రాసారు. అలానే అనేక స్వతంత్ర అనువాద సాహిత్య రచనలు చేసారు. బుద్ధుని బోధనలకి సంబంధించి దమ్మ పధం, రవీంద్రనాథ్ టాగోర్ గీతాంజలి, ఖలీల్ జిబ్రాన్ ప్రాఫేట్ ని అనువదించి  తెలుగు వారికి అందించారు.

ఖలీల్ జిబ్రాన్ ప్రపంచ సాహిత్య చరిత్రలో గొప్ప కవిగా, రచయత, చిత్రకారుడు, తత్త్వవేత్త గా పేరొందిన వ్యక్తి. అయితే ఆటను తనని తత్త్వవేత్తగా పిలవడాన్ని తిరస్కరించాడు. చాలాకాలం క్రితం తెలుగులో జిబ్రాన్ ప్రాఫెట్ నుంచి కొన్ని భాగాలను జిబ్రాన్ సూక్తులు అనే పేరుతో బాలబంధు బి.వి.నరసింహారావు గారు అనువదించారు. కాళోజి జీవన గీత పేరుతో, ఇటీవల మరికొందరు కూడా జిబ్రాన్ ప్రాఫెట్ ని అనువదించారు.

ప్రాఫెట్ అంటే ప్రవక్త అని నిఘంటువు అర్ధం. మనకి ఈ పదంతో పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా, పశ్చిమాసియా  ప్రాంత వ్యక్తిగా ఆ పదం ప్రాముఖ్యత ఖలీల్ జిబ్రాన్ కి బాగా తెలుసు. క్రీస్తుకి పూర్వం ఇస్రాయిల్ జాతి చరిత్రలో  ప్రవక్తలు ఒక భాగంగా  ఉండేవారు. ఒక రకంగా ప్రవక్త ఆ ప్రజల భౌతిక జీవనయానం  నైతిక సూత్రా లకనుగుణమైనదిగా  ఉండేలా  చూసే ఒక గైడింగ్ ఫోర్సు  లేదా ఒక మార్గదర్శిగా చెప్పొచ్చు.  బైబిల్  లో పాత నిబంధన చదివినప్పుడు ఈ ప్రవక్తల ప్రాముఖ్యత అర్ధమవుతుంది. వారు  దైవావేశ ప్రేరిత ప్రవచనం పలుకుతారు. చాలా సాధారణ జీవితం వారిది. అవసరమైనప్పుడు రాజుని సైతం గద్దిస్తారు. ప్రజలకి సరైన మార్గాన్ని నిర్దేశిస్తారు. ప్రజలలోనే ఉంటారు. చాలా చేదు  నిజాల్ని కుడా నిర్భయంగా, నిర్ద్వంద్వంగా  ప్రకటిస్తారు. ఒకరకంగా  వారి హోదా గుర్తింపబడుతూనే నిరాకరణని ఎదుర్కొనే వ్యక్తులు వారు. జెర్మియా, ఐజయ, జెఫన్య, హబక్కుకు లాంటి అనేక ప్రవక్తలని మనం చూస్తాము. వారు హింసల్ని ఎదుర్కొని ప్రాణాల్ని కోల్పోయినవారు. ప్రవచనం ఒక చేదు వ్యాఖ్యానం. ప్రవక్త నిజాయితీ అతడ్ని అందరిచేత నిరాకరించేలా చేస్తుంది. తప్పుడు మార్గాలు అవలంబించేప్పుడు, దుర్బొదలు తలెత్తినప్పుడు ప్రవక్త  గద్దింపు లోనుండి ప్రవచనం వెలువడుతుంది. స్ధూలంగా  ప్రవక్త ని ఇలా అర్ధం చేసుకుంటాం.

అయితే జిబ్రాన్ తన పుస్తకానికి ఈ పేరెందుకు పెట్టారు, ఈ గద్య కవిత్వాన్ని ఇలా నిర్మించాలనుకోవడంలోనే ఆ పేరు తలెత్తిఉంటుంది.  పుట్టింది క్రైస్తవ కుటుంబంలోనే అయినప్పటికీ అతడి ఇంటివాతావరణము భిన్న మతాలూ, విశ్వాసాలు కలిగిన వ్యక్తుల రాకపోకల కేంద్రంగా ఉండడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. ప్రాఫెట్ తో పాటుగా ఇంకా చాలా పుస్తకాలు రాసినప్పటికీ ఈ పుస్తకమే ఎందుకు అత్యంతాదరణ పొందింది అనే అంశాలనన్నిటినీ కూడా అతని జీవితానుభవ సారాంశం నుంచి మనం అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. క్లుప్తంగా జిబ్రాన్ జీవితాంశాలలోకి వెళ్తే అప్పటి లెబనాన్ రాజకీయంగా, ఆర్ధికంగా, సాంఘికంగా పతనావస్థలో ఉంది. అఅలాంటి దుర్భర పరిస్థితుల్లో లెబనాన్ లోని అనేక కుటుంబాలకు మల్లె జిబ్రాన్ కూడా తన కుటుంబంతో 12 వ ఏట అమెరికాకు వెళ్ళాడు. అక్కడ విద్యతో పాటుగా చిత్రలేఖన కళను అభ్యసించాడు. తన రచనల కన్నా ముందే చిత్రకారుడిగా గుర్తింపు పొందాడు. అనేక కళా ప్రదర్సనలు ఏర్పాటు చేసాడు. అతని చిత్రాలను అనేకమంది ప్రచురణ కర్తలు ముఖచిత్రాలుగా ప్రచురించారు. తిరిగి లెబనాన్ వచ్చి చదువు కొనసాగించాడు. లెబనాన్ ప్రాంత సాంప్రదాయాలు, టర్కీ పరిపాలనపట్ల ప్రజల అసంతృప్తి ఇవన్నీ అతని మొదటి రచనలకి కారణం అయింది. వీనిలో కొన్ని రచనలను ప్రజలలో ప్రభుత్వంపట్ల వ్యతిరేకతను ప్రేరేపిస్తున్నాయని నిషేధించారు కూడా.

ఇక ప్రాఫెట్ విషయానికొస్తే జిబ్రాన్ అన్నట్లు “... లెబనాన్ కొండల్లో ఉన్నప్పుడు ఈ పుస్తకం రూపుదిద్దుకున్న తొలినాటినుంచి అది నా దగ్గరే ఎల్లప్పుడూ ఉండేది. అది నాలో ఒక భాగమై పోయినట్లుండేది, దీనిని ప్రచురణ కర్తలకి ఇచ్చేముందు కూడా నాలుగేళ్ళపాటు నాదగ్గరే ఉంచుకున్నాను. అందులోని ప్రతి ఒక్క మాట నేను రాయగలిగిన దాంట్లో అత్యుత్తమమైనదని నేను నిర్ధారించుకున్న తర్వాతే ప్రచురణకు ఇచ్చాను” అంటారు. బహుసా అందుకే ఈ పుస్తకం మొత్తం జిబ్రాన్ జీవిత సాఫల్యతకు ప్రమాణంగా నిలిచింది. 

ఇంతగా చెపుతున్న ఈ పుస్తకంలో జిబ్రాన్ ఏమి రాసాడు, ఏమి చెప్పాలనుకున్నాడు, తన స్థల,కాలాదులు దాటిన ఏ ప్రాపంచిక సత్యాన్ని ఆవిష్కరించాడు. నిజం చెప్పాలంటే ప్రాచీన యూదు మత ప్రవక్తలకు మల్లె సంక్లిష్టవ్యవస్థల సంకెలల మధ్య చిక్కుకు పోయిన ప్రజలపట్ల ఒక సానుభూతితో, ఒక అప్రమత్తతతో కృతజ్ఞాతా కానుకగా ఈ పుస్తకంలో ఒక దర్శనాన్ని అందించాడు. సరళ సత్యాలను ఆవిష్కరించాడు. దానిని మన ఆలోచనలతో అర్ధం చేసుకునే ఒక ప్లేన్(plane) లో ఉంచాడు. అందుకే అది ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది. అర్ధం చేసుకునేంతలో మరో కొత్త అర్ధాన్ని ఇస్తూనే  ఉంది.

దాదాపుగా పన్నెండేళ్ళు పాటు అర్ఫలీస్ పట్టణంలో గడిపిన అల్ ముస్తఫా అనే ప్రవక్త చివరికి తనను తన ఊరికి చేర్చే నౌకాగమనం తో ఈ కావ్యగానం ప్రారంభమవుతుంది. ఈ పన్నెండేళ్ళు అతనిని గౌరవించి, ప్రేమించిన ఆ పట్టణ  ప్రజలు వీడ్కోలు పలకడానికి వచ్చినప్పుడు, వారు అడిగిన వివిధ అంశాల పట్ల వారికి ఇచ్చిన సమాధానాలుగా ఈ కావ్యాన్ని రాసారు. అనేకమంది ప్రజలు, కర్షకుడు, పసిబిడ్డను వక్షానికి హత్తుకున్న మాతృమూర్తి, సంపన్నుడు,వృద్ధుడైన అన్నసత్రపు నిర్వాహకుడు, యువతి, యువకుడు, భవననిర్మాణ మేస్త్రి, చేనేత కార్మికుడు, వ్యాపారి, న్యాయమూర్తి, న్యాయవాది, ఉపన్యాసకుడు, మహిళ, అధ్యాపకుడు, విద్యావేత్త, ఖగోళ శాస్త్రవేత్త, నగర పెద్ద, అర్చకురాలు, ఆ నగరానికి ఏడాదికోసారి వచ్చే సాధువు ఇలా అన్నివర్గాల ప్రజలు ప్రేమ, వివాహం, పిల్లలు, ఇవ్వడం, తినడం, తాగడం, పని, ఆనంద విషాదాలు, ఇళ్ళు, వస్త్రాలు, కొనడం, అమ్మడం, నేరం శిక్ష, చట్టాలు, స్వేఛ్చ, వివేకం మొహం, వేదన, స్వీయ జ్ఞానం, బోధన, మైత్రి, మాట్లాడడం, కాలం, మంచి చెడులు, ప్రార్ధన, ఆనందం, సౌందర్యం, మతం, మరణం ఇలా దాదాపుగా 26 అంశాలపై  అడిగిన ప్రశ్నలకి ఇచ్చిన సమాధానమే ఈ కావ్యం.

వివాహం గురించి అడిగిన ప్రశ్నకు “ జంటగా జన్మించినవారు మీరు/ఎప్పటికీ జంటగానే ఉండాలి/మృత్యువు తన తెల్లని రెక్కలతో/ మీ ఆనంద జీవిత దివసాల్ని /చెల్లా చెదురు చేసినా సరే/మీరు జంటగానే ఉండాలి//... ఆ సాన్నిహిత్యం నడుమ అక్కడక్కడా ఉంచండి కొన్ని ఖాళీలని / అందులోనే స్వర్గ సమీరాలు / మీ ఇరువురి మధ్య నర్తించనీయండి // పరస్పరం ప్రేమించుకోండి / కానీ ప్రేమ సంకెళ్ళని వేసుకోకండి/ దానిని ఎల్లెప్పుడూ /మీ అంతరాత్మల తీరాల మధ్య / అలలై ఎగిసిపడే కడ లిగానే  ఉంచండి. నింపుకోండి మీ పానపాత్రలను పరస్పరం/ కానీ తాగకండి ఒకే పాత్రలో...! / మీరు తినే రొట్టెని ఒకరికొకరు ఇచ్చుకోండి / కానీ, ఒకే రొట్టెను మాత్రం తినకండి// ఆడండి, పాడండి, ఆనందించండి / ఇద్దరూ కలిసి /కానీ, మీలో మీరే ఏకాంతంగా ఉండండి.// ... ఇచ్చి పుచ్చుకోండి హృదయాల్ని/ కానీ, ఉండకండి / ఒకరి అదుపులో ఇంకొకరు/ ఎందుకంటే / జీవితానికి చేయూతగా నిలిచే / హస్తమే మీ హృదయాలకు ఆలంబనే / సన్నిహితంగా ఉండండి ఒకర్నొకరు / కానీ మరీ అతుక్కుపోకండి!"

ఇలా సార్వత్రిక తాత్త్విక సత్యాలను ప్రాఫెట్ లో జిబ్రాన్ అందిస్తే అంతే రమ్యంగా తెలుగులోకి బెందాళం కృష్ణారావు అనువాదం చేసారు.  

ఈ ప్రాఫెట్ మొదటి ముద్రణ నుంచీ ఇప్పటికీ అనేక భాషలలో ముద్రించబడని రోజు లేదంటారు. అంతగా సాహిత్య ప్రేమికుల్ని, ప్రజల్ని అలరించింది. ‘ప్రవక్త’గా జిబ్రాన్ ‘ప్రాఫెట్’ ని బెందాళం కృష్ణారావు తెలుగులో అత్యంత మాధుర్యమైన అనువాదం చేసారు. గొప్ప అనువాదం మనకు అనువాద కృత్రిమత్వాన్ని  దూరం చేసి స్వతంత్ర రచన చదివిన అనుభవాన్ని మనకు ఇస్తుంది. ఈ అనువాదం అలాంటి అనుభవాన్ని పాఠకుడికి ఇస్తుంది. ప్రవక్తలో జిబ్రాన్ భావాలను తెలుగులో బెందాళం కృష్ణారావు సహజంగా, స్వేచ్చగా పలికించారు. ఒక గొప్ప తాత్త్విక రచనని తెలుగు పాఠకులకి అందించిన కృష్ణారావుగారు అభినందనీయులు.

                                                                                                                                                                                                                                                                   మల్లవరపు ప్రభాకరరావు,

                                                                                                                                                                      9949996405

 

Comments

Popular posts from this blog

అజాత శత్రువు

మధురకవి మల్లవరపు జాన్ గారి పై సాహీతీ కౌముది ప్రత్యేక సంచిక