కొండల నడుమ “గుప్పెడు సూర్యుడు మరి కొన్ని కవితలు”
ఈ
సంవత్సరం ఉత్తమ తెలుగు అనువాదకుడిగా ప్రముఖ కవి, పాత్రికేయులు
శ్రీఎ.కృష్ణారావు కి కేంద్రసాహిత్య అకాడమీ ప్రకటించింది. ప్రముఖ డోగ్రీ భాషా
కవయిత్రి పద్మా సచ్ దేవ్ కవిత్వం “ A handful of sun and other poems” పేరుతో ఆంగ్లభాష లోకి అనువదించిన డోగ్రీ భాషా కవిత్వాన్ని తెలుగులోకి
“గుప్పెడు సూర్యుడు మరి కొన్ని కవితలు” పేరుతో తెలుగులోకి అనువదించినందుకు ఆయనకీ
పురస్కారం లభించింది. వారు అనువదించిన పద్మా సచ్ దేవ్ కవిత్వాన్నిఇంతకు
ముందెప్పుడో చదివినా ఇప్పుడు అవార్డ్ ప్రకటనతో మరోమారు చదివాను. ముఖ్యంగా అనువాద
కవిత్వమైనా ఇదేదో నేరుగా రాసిన కవిత్వం లా అనిపించింది. అనువాద
కవిత్వం లా అనిపించకుండా చేయడంలోనే కృష్ణారావు గారి విజయం దాగి ఉంది.
పద్మా సచ్
దేవ్ డోగ్రీ భాషలో తొలి కవయిత్రి. జమ్ము కాశ్మీర్ , హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ లలోని కొన్ని ప్రాంతాలలో
మాట్లాడే డోగ్రీ భాషను 2003 లో రాజ్యాంగం లోని గుర్తింపు పొందిన భాషలలలో
చేర్చారు. ఈ ప్రాంతంలో ఉద్భవించిన పహాడీ చిత్రకళ శోభాయమానంగా ఉండి ప్రపంచ
గుర్తింపు పొందింది. మాట్లాడతారు. పద్మా
సచ్ దేవ్ తండ్రి ప్రముఖ పండితుడైన పండిత జయదేవ్ ను దేశవిభజన సమయంలో కోల్పోయారు. ఆ
ఆవేదన ఆమెను చాన్నాళ్లపాటు వెంటాడింది. ఆమె కవిత్వంలో హిమాలయ ప్రాంతాల నైసర్గికత, ఆ ప్రాంత ప్రజల సారళ్యం ధ్వనిస్తుంటూంది. ముఖ్యంగా డోగ్రీ స్త్రీల వేదన, ఆనందాలు, వేడుకలు, అంత:
సంఘర్షణలు చోటుచేసుకుంటాయి.
“చీకటిలో నన్ను బంధించకండి/నేను మనిషిని/ఆత్మను కాదు”
“నాకు నిరంతర ప్రయాణం కావాలి/నదిలా ప్రవహించాలి/మధ్యలో దారి
తప్పినా సరే”
ఆమె కవితా
పంక్తులు మనిషి మూర్తిమత్వం సంతరించుకోడం గురించే ఉంటుంది. ఆరు భాగాలుగా విభజించిన
64 కవితల సమాహారం ఈ గుప్పెడు సూర్యుడు కవిత్వం. కవిత్వంలో సున్నితత్వం
సూదంటురాయిలా పాఠకుడ్ని గుచ్చుకుంటుంది. స్వేచ్చను, స్వాతంత్ర్యాన్ని
ప్రకటించే మనిషి అంతరంగం కవిత్వం అంతటా పహాడీ రాగమై ప్రవహిస్తుంది.
గాలిపటం
అనే కవితలో “ఒక గాలిపటాన్ని సుదూర తీరాలకు/ పయనించడం చూసిన/ మరో గాలిపటం
తెంపుతుంది.../ అది గాలిపటం కాదు ఒక స్త్రీ/ దాని దారం ఎవరో ఆగంతుకుడైన పురుషుడి
చేతుల్లో....”
క్రొవ్వొత్తి
అనే కవితలో “క్రొవ్వొత్తి దగ్ధమౌతుంది/ క్రొవ్వొత్తి కరిగి పోతుంది/ క్రొవ్వొత్తి
కనలి పోతుంది/ క్రొవ్వొత్తి పాత్రగా మారిపోతుంది...” అంటూ క్రొవ్వొత్తిని స్త్రీకి
సంకేతంగా చూపిస్తారు. పద్మా సచ్ దేవ్ కవిత్వంలో కొండవాలుగా తేలిపోయే పొగ మధ్య
విశాల పచ్చికలో గడ్డి మేసే ఆవు గెంతులలో నిత్య జీవిత వైవిధ్యాన్ని చూడొచ్చు. ఇంత
మంచి కవిత్వాన్ని తెలుగులోకి అనువదించిన కృష్ణారావుకి అభినందనలు.
- మల్లవరపు ప్రభాకరరావు
Comments