జిబ్రాన్ తాత్త్విక సంవేదన బెందాళం కవితానువాదం “ప్రవక్త”
బెందాళం కృష్ణారావు గారు ప్రముఖ పాత్రికేయులు. అనేక పత్రికలలో పనిచేసారు. చాలా పత్రికలకు ఫీచర్స్ రాస్తుంటారు. పాత్రికేయ వృత్తికి సంబంధించి మీరే జర్నలిస్ట్ లాంటి పుస్తకాలు రాసారు. అలానే అనేక స్వతంత్ర అనువాద సాహిత్య రచనలు చేసారు. బుద్ధుని బోధనలకి సంబంధించి దమ్మ పధం, రవీంద్రనాథ్ టాగోర్ గీతాంజలి, ఖలీల్ జిబ్రాన్ ప్రాఫేట్ ని అనువదించి తెలుగు వారికి అందించారు. ఖలీల్ జిబ్రాన్ ప్రపంచ సాహిత్య చరిత్రలో గొప్ప కవిగా, రచయత, చిత్రకారుడు, తత్త్వవేత్త గా పేరొందిన వ్యక్తి. అయితే ఆటను తనని తత్త్వవేత్తగా పిలవడాన్ని తిరస్కరించాడు. చాలాకాలం క్రితం తెలుగులో జిబ్రాన్ ప్రాఫెట్ నుంచి కొన్ని భాగాలను జిబ్రాన్ సూక్తులు అనే పేరుతో బాలబంధు బి.వి.నరసింహారావు గారు అనువదించారు. కాళోజి జీవన గీత పేరుతో, ఇటీవల మరికొందరు కూడా జిబ్రాన్ ప్రాఫెట్ ని అనువదించారు. ప్రాఫెట్ అంటే ప్రవక్త అని నిఘంటువు అర్ధం. మనకి ఈ పదంతో పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా, పశ్చిమాసియా ప్రాంత వ్యక్తిగా ఆ పదం ప్రాముఖ్యత ఖలీల్ జిబ్రాన్ కి బాగా తెలుసు. క్రీస్తుకి పూర్వం ఇస్రాయిల్ జాతి చర...