అదొక అందమైన నిరీక్షణ

విరహమంటే దుక్ఖం కాదు
అదొక విరామం
జ్ఞాపకాల్ని తలపోసుకోడానికి కాసింత ఏకాంతం

బాల్కనీలో కూర్చొని
సన్నగా వినిపించే గజల్ మాధుర్యాన్ని
వెన్నెల సోయగాన్ని
రెండు హ్రుదయాలు మౌనంగా ఆస్వాదించడం
మౌనాన్నే సంభాషణగా మార్చుకోవడం
కొబ్బరాకుల కిటికీ చువ్వల్లోంచి
చందమామను పిలిచే తుంటరితనం
పిల్లతెమ్మెర గుసగుసలలొ రహస్యాన్ని పంచుకోవడం
ప్రియురాలు ఆదమరిచి నిద్రిస్తున్నప్ప్పుడు
చేతితో సుతారంగా ముంగురులు సవరించడం
తెలిసీ తెలవని పలవరింతలు
అలలు అలలుగా జ్ఞాపకాల్ని వెంట తెచ్చే
అనుభూతి సముద్రం

అవును విరహమంటే శోకం కాదు
ఎడారిలో చంద్రోదయాన్ని వీక్షించడం
మధురానుభూతుల్ని ప్రియంగా చుంబించడం
ప్రియురాలి చిర్నవ్వు మెరుపులో
మరొక్కసారి తళుక్కుమనడానికి ఎదురు చూడడం
జీవితం చివరికంటా మిగుల్చుకోడానికి
కాసింత పరిమళాన్ని పొదువుకోవడం

విరహమంటే అగాధలోయల్లోకి
విసిరేయబడ్డం కాదు
కాస్సేపు జ్ఞాపకాల వీధుల్లో ఊరేగడం
సరోద్ తంత్రుల సన్నని నాదాన్ని
ప్రియురాలి సోగకళ్ళ చిలిపిదనాన్ని
జుగల్బందీగా వీక్షించడం

విరహమంటే
నిద్రకూ మెలుకువకూ మధ్య మంచి కలగనడం
విరహమంటే...
అదొక అందమైన నిరీక్షణ

మల్లవరపు ప్రభాకరరావు(2002)

Comments

suresh said…
person to be honoured
suresh said…
plz update the blog

Popular posts from this blog

అజాత శత్రువు

మధురకవి మల్లవరపు జాన్ గారి పై సాహీతీ కౌముది ప్రత్యేక సంచిక