ఒక వేసవి రాత్రి

పగలంతా మూసిఉంచిన గది
తెరిచీ తెరవంగనే ముక్కవాసన
ఏ పరిమళమూ స్వాగతించని గదిలోకి
నేనూ, నిశ్శబ్దమూ...


పరచిన చాప,చుట్టిన పరుపూ
ఛైతన్యరహితమై ఒక మెలాంకలీ గీతాన్ని వినిపిస్తుంది
దండానికి వేలాడుతున్న బట్టలన్నీ
అనంత శోకాన్ని ఉరేసినట్లుగా అనిపిస్తాయి
ఈ గది ఒక బాధాకర నిరీక్షణకు చిహ్నమైపోతుంది
ఒక సౌగంధికా పరీమళభరిత ఙ్ఞాపకాన్ని
ఆవాహన చేసుకొనే ఆనవాలు కనిపించని
ఒక శూన్య ప్రదేశాన్ని సౄష్టిస్తుంది

రాత్రి మరీను…
పగలంతా ఆఫీసు అలజడిలో అలసిన
నాకు ఈగది ఏ చిర్నవ్వు బహుమానమూ ఎదురవ్వని
దుఃఖాన్ని బహుమతి ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది
కానీ ఈగది నాకు ఒక అనివార్య ప్రవేశం..
చుక్కలు చుక్కలుగా చప్పరించాల్సిన అనివార్యదుఃఖం...
ఈ వేసవి రాత్రి…
కిటికీకావల పరుచుకున్న వెన్నెల
వెన్నెల కురుస్తున్నట్లుగా లేదు
వెచ్చని నిట్టూర్పులు విడుస్తున్నట్లుగా వుంది
అప్పుడప్పుడూ తెరలు తెరలుగా వీస్తున్న గాలి
కొబ్బరాకుల్లో చిక్కుకున్న నవ్వై నాలో ఙ్ఞాపకాల్ని గుచ్చుతుంది
ఇక్కడో ఆశ తన రెండుకళ్ళ దీపాల వెలుగులో ప్రతిబింబిస్తూ
నాలోనూ, నా గదిలోనూ సజీవ చైతన్యాన్ని నింపుతుంది

-మల్లవరపు ప్రభాకరరవు
(2002)

Comments

Popular posts from this blog

అజాత శత్రువు

మధురకవి మల్లవరపు జాన్ గారి పై సాహీతీ కౌముది ప్రత్యేక సంచిక