ఙ్ఞాపకంగా మారిన నవ్వు

నవ్వుతూ ఉండడం
అంత తేలికేమీ కాదు
నవ్వుతో కోటి దీపాలు వెలిగించడం
బ్రతుకులో ఆశలు పూయించడం
నిజంగా నవ్వడమంటే
మామూలు విషయం కాదు
మొహానికి రంగేసుకున్నట్లుండే
ముసుగు తగిలించుకున్నట్లుండే
తోడేలు మొహానికి మేక ముసుగు తొడుక్కునే
ప్లాస్టిక్కు నవ్వుల గురించి కాదు
ప్పుడు మాట్లాడడం

నవ్వు గురించి మాట్లాడ్డమంటే
హృదయశుథ్థిగల వ్యక్తి పెదాలపై
అలలుగా కదిలే నవ్వు గురించిన ఙ్ఞాపకం
ఇప్పుడు
నవ్వు
ఙ్ఞాపకంగా మారిన పెదాల మథ్య మూలుగు

ఒక్క నవ్వేనా!
మాటలు కూడా మననం చేసుకోవాల్సివస్తుందని
ఎప్పుడైనా తలచామా...
అయినా మాటలంటే
అవేమంత సుదీర్ఘ సంభాషణలేమీకాదుగా
నీలోకి చూసి
నిన్ను తట్టిలేపి
నీ భుజంపై చేయివేసి
నీ బ్రతుకుకు భరోసా ఇచ్చే మాటలు
పెదాలు పలికే మాటల హృదయావిష్కరణ

అవును మాటలంటే
నమస్తే పాపా, నమస్తే బాబూ
నమస్తే చెల్లెమ్మా, నమస్తే అక్కయ్యా
నమస్తే అన్నయ్యా, నమస్తే తమ్ముడూ
నంస్తే అవ్వా, నంస్తే తాతా...
నమస్తే... నమస్తే...
మాటల్లోని క్లుప్తత చొచ్చుకుపోయే
సుదీర్ఘ రహస్య సంభాషణ
కాకపోతే కోట్లమంది రహస్య స్నేహితుడి
అదృశ్యం మిగిల్చిన కోట్ల దు:ఖాలు
ఈ రోజు బేగంపేటకో, పావురాలగుట్టకో
ఇదుపులపాయకో ఎందుకు పయనమవుతాయి

ఒక్క మాటేనా -
నమ్మకం నింపుకున్న జనహృదయలను
వాస్తవంలోనికి నడిపించడం
ఉదయమిచ్చిన మాట రాత్రి మత్తులోకి జారిపోయే కాలంలో
మాటాకోసం మడమ తిప్పని సుయోథనుడి సమక్షం
చరిత్రగా మారిపోతే
కట్టలు తెగిన ఙ్ఞాపకాలే ప్రవహిస్తాయి

--- మల్లవరపు ప్రభాకరరావు
(రాజశేఖర కవితాస్మృతి, ద్రావిడ విశ్వవిద్యాలయం)

Comments

Popular posts from this blog

అజాత శత్రువు

మధురకవి మల్లవరపు జాన్ గారి పై సాహీతీ కౌముది ప్రత్యేక సంచిక