సొంత గొంతు

మావికాని నినాదాల హోరులో తడిసినోళ్లం
మావికాని వివాదాల సుడులలో విసిరేయబడ్డవాళ్లం
మావికాని మాటలకు చప్పట్లై హోరెత్తినవాళ్లం

ఇన్నాళ్లూ...
మీ పదవుల పందేరంలో
పావులైనోళ్లం
మీ సంపదల తూణీరంలో
చెమట చుక్కలై రాలినోళ్లం
మీ అథికార దర్పానికి
ఆథారమైనోళ్లం
మీ భవంతుల రంగుటద్దాల్లో
నీడలైనోళ్లం
మీ మేకవన్నె చిఱ్నవ్వుల వెనక
నెత్తుటి మరకలైనోళ్లం
మీ వెన్నపూస మనస్సు ముసుగు లోపల
లాకప్ చావులైనోళ్లం
మీ బినామీ భూముల పట్టాలమీద
వేలిముద్రలైనోళ్లం

ఇక, ఇప్పుడిప్పుడే
మా గొంతేదో ఆనవాలు పడుతున్నాం
ఏ ఎండకా గొడుగుల నీడలలోంచి బయట పడుతున్నాం
జెండా కర్రల మోత బరువులను దించుకుంటున్నాం


ఇక, ఇప్పుడిప్పుడే
మా నలిగిపోయిన శరీరాలనుంచి
కారుతున్న చెమట చుక్కలనుంచి
మా విసిరివేయబడ్డ వాడల్లోంచి
ఇరుకు గుడిసెల్లోంచి
బరువెక్కిన గుండెల్లొంచి
మా మాటలను కూర్చుకుంటున్నాం

ఇక, ఇప్పుడు
చేలగట్లపై వాలిన మొండేల సాక్షిగా
కాలువలై పారీన నెత్తురు సాక్షిగా
నిలువెత్తు నల్లజెండాను నిలేసి
శతాబ్దాల భావదాస్యపు నీడలలోంచి బయట పడుతున్నాం
ఆగమై పోయిన మాయమ్మల రోదనతో
మా యుథ్థతంత్రాన్ని మేమే రచించుకుంటాం
ఇక మా అడుగులను మేమే పరచుకుంటాం

ఇక ఇప్పుడు
అరువు గొంతుల వాగ్దానాలు తిప్పికొడ్తాం
అలవాటు పడిపోయిన నినాదాలను వెక్కిరిస్తాం
ఇక మా బాట మేమే ఎంచుకుంటాం
మా పాట మేమే పాడుకుంటాం

__ మల్లవరపు ప్రభాకరరావు(1996)
(కవితా ప్రకాశం'99 కవితా సంకలనం)

Comments

Popular posts from this blog

అజాత శత్రువు

మధురకవి మల్లవరపు జాన్ గారి పై సాహీతీ కౌముది ప్రత్యేక సంచిక