నీలి శివసాగరం




నీలాకాశం పరచుకున్న శివసాగరం
శివసాగరాన్ని అల్లుకున్న నీలాకాశం
వాడ ముంగిట కళ్లాపి ముగ్గు శివసాగరం
వాడ మథ్య నిలేసిన నీలిజెండా శివసాగరం

క్షణకాలం స్థంభించిన చైతన్యానికి
డప్పు కాస్సేపు మౌనం వహించింది
ఛిర్ర చిటికెన పుల్లా దగ్గరగా చేరి
నివాళి అర్పిస్తున్నాయి

బోయీల పాట
జాలరన్న తెరచాప పాట
మనుషులంతా పాడాల్సిన పాటల హోరులో
మనిషి మరల మరలా జన్మిస్తున్నాడు

అవును అతని మరణమొక జననం
అతని మరణం శతాబ్దాల జననం
జనప్రసవం
కాలాలు దాటి ప్రవహిస్తున్న చైతన్య పరిమళం
బహుశా ఏ మొహంజదారో కోట గోడల మథ్య
తిరుగాడిన చెలికాని సంభాషణలానో
ఏ ఆర్యపుత్రుని బాణానికో కూలిన
హరపీయ యువకుని ఆర్తనాదంలానో
శంభూకుని మరణ నాదం విన్న
అస్పృస్యుని అలజడిలానో
ఫరమ ఛండాలుడి ప్రేమగీతంగా
తరాలుగా ప్రవహిస్తున్న చైతన్యం శివసాగరం

కాలరహిత స్వప్నాన్ని
కాంక్షించిన దార్శనికుని
మౌనం అక్షరాల మథ్య ప్రవహిస్తుంది

అక్షరాలనుండే అణువిస్ఫోటనం గావించే
ప్రేమికుని సంభాషణల తీవ్రతను
ముద్దు పెట్టుకునే
థైర్యమిచ్చిన సహచరుడికి
రెల్లుగడ్డి నివాళి గీతం పాడుతుంది

నీలినింగిని చేరిన శివసాగరం
వాన చినుకై నేలతల్లిని ముద్దాడినప్పుడు
ఇప్పపువ్వు నవ్వుతుంది

---- మల్లవరపు ప్రభాకరరావు

Comments

Popular posts from this blog

పరిమళించే 'జాతీ'యత !

అజాత శత్రువు

మధురకవి మల్లవరపు జాన్ గారి పై సాహీతీ కౌముది ప్రత్యేక సంచిక