దళితుల విజయగాధలు 'దళిత్ డైరీస్'
నాగప్పగారి సుందర్రాజు తన ' చండాల చాటింపు ' కవితా సంపుటిలో ఒక కవితలో "ఇకనుంచి నా పాట నేనే పాడుకుంటా" అంటాడు. అవును . ఎవరూ పాడని తన జీవితాన్ని తనే ప్రకటించుకోవాలనే ఒక కోరికను వ్యక్తపరుస్తాడు. దళితుల విజయాలు మన దగ్గర నమోదు చేయరు. ఇవేమీ వ్యక్తిత్వ వికాస పాఠాలలో సిలబస్ గా మారదు. కులాన్ని విస్మరించే ఏ విజయమైనా ప్రధాన స్రవంతి మీడియాకు సమ్మతమే. ఈ దేశంలో ప్రధాన స్రవంతి ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించే విజయగాధలు నమోదు చేసిన పుస్తకమే రజిత కొమ్ము రాసిన ' దళిత్ డైరీస్ '. ఇందులో రాసిన 25 మంది విజయగాధలు అన్నీ కోల్పోయిన జీవితాలలో వెలుగు రేఖలు నింపిన ఆత్మగాధలు. నిజంగా దళిత సమాజానికి ఈ సమయంలో కావాల్సిన కథలు. తమ వేదనామయ జీవితాలలో ఒక ఆశ మొలకెత్తుతుంది అన్న నమ్మకాన్ని ఇవ్వగలిగిన ప్రేరణాత్మక వచనం ఈ పుస్తకం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ దేశంలో దళితుల విజయగాధలు విస్మరించబడ్డాయి. వారికి స్ఫూర్తి నిచ్చే చరిత్ర అందరిదీ కాకుండా పోయింది. అందుకే ఇప్పుడీ పనిని కొత్తగా అక్షరాలు తలకెత్తుకున్న దళిత యువత తమ మూలాల్లోకి వెళ్లి మరీ వెలికి తీస్తుంది. అలాంటి పనినే సమర్ధంగా నిర్వహించారు కొమ...