Posts

Showing posts from December, 2009

ఒక వేసవి రాత్రి

పగలంతా మూసిఉంచిన గది తెరిచీ తెరవంగనే ముక్కవాసన ఏ పరిమళమూ స్వాగతించని గదిలోకి నేనూ, నిశ్శబ్దమూ... పరచిన చాప,చుట్టిన పరుపూ ఛైతన్యరహితమై ఒక మెలాంకలీ గీతాన్ని వినిపిస్తుంది దండానికి వేలాడుతున్న బట్టలన్నీ అనంత శోకాన్ని ఉరేసినట్లుగా అనిపిస్తాయి ఈ గది ఒక బాధాకర నిరీక్షణకు చిహ్నమైపోతుంది ఒక సౌగంధికా పరీమళభరిత ఙ్ఞాపకాన్ని ఆవాహన చేసుకొనే ఆనవాలు కనిపించని ఒక శూన్య ప్రదేశాన్ని సౄష్టిస్తుంది రాత్రి మరీను… పగలంతా ఆఫీసు అలజడిలో అలసిన నాకు ఈగది ఏ చిర్నవ్వు బహుమానమూ ఎదురవ్వని దుఃఖాన్ని బహుమతి ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది కానీ ఈగది నాకు ఒక అనివార్య ప్రవేశం.. చుక్కలు చుక్కలుగా చప్పరించాల్సిన అనివార్యదుఃఖం... ఈ వేసవి రాత్రి… కిటికీకావల పరుచుకున్న వెన్నెల వెన్నెల కురుస్తున్నట్లుగా లేదు వెచ్చని నిట్టూర్పులు విడుస్తున్నట్లుగా వుంది అప్పుడప్పుడూ తెరలు తెరలుగా వీస్తున్న గాలి కొబ్బరాకుల్లో చిక్కుకున్న నవ్వై నాలో ఙ్ఞాపకాల్ని గుచ్చుతుంది ఇక్కడో ఆశ తన రెండుకళ్ళ దీపాల వెలుగులో ప్రతిబింబిస్తూ నాలోనూ, నా గదిలోనూ సజీవ చైతన్యాన్ని నింపుతుంది -మల్లవరపు ప్రభాకరరవు ...

ఒక రాత్రి

చీకట్లో దేవులాడుతూ.. ప్రియురాలి చుంబనం కోసం ఎంతకీ విచ్చుకోని వెన్నెల ఏమిటో నేలపై సన్నజాజులు రాలిన పరిమళం కూడా లేదు చీకట్లో కళ్ళు తడుముతుంటాయి కనపడని దానికోసమే సిధ్ధాంతాలు పురివిప్పని నెమలి పింఛం కోసం కళ్ళు పుస్తకాల్లొ వెదుకుతుంటాయి తుంటరి కుక్క పిల్ల పైకెగిరే ఆనందంలో ఎక్కడో చిక్కుకున్న గాలిపటాన్ని వెతికి తీయాలి రాత్రయితే చాలు వెలుగు పరుచుకోవాలి కదా కనీసం మిణుగురు కాంతి కూడా లేదు ఆమె కన్నుల్లో నిండిన కాంతిని నాలోకి ఒంపుకోవడం చాతకావడం లేదు హైద్రాబాదీ ఖవాలీ గీతాల్లో విరహమై చీకటి నిండుతోంది దోసిళ్ళతో తాగడానికి కవిత్వమొక్కటే సరిపోతుందా! -- మల్లవరపు ప్రభాకరరావు(2002)

సింధటిక్ రంగులు

జారిపోతున్న నమ్మకాన్ని ఏ ఆశలతోనో పట్టుకోవాలని మనిషి రంగులను వెదజల్లుతున్నాడు అన్నీ వెలసిపోయిన రంగులే నవ్వులను రువ్వలేనప్పుడు ఏ రంగు మాత్రం కాంతిగా ఉంటుంది అబధ్ధాలు వినీ వినీ అవే నిజాలని నమ్మి ఇప్పుడు అనాలోచితంగా రంగులు విసురుతున్నాడు ఆశలను మొలకెత్తించలేనప్పుడు ఏరంగు మాత్రం కంటిలో పూలు పూయించగలదు మనిషి ఒంటరితనంలోకి జారిపోతున్నాడు అమ్మను,అమృతత్వాన్ని ఊరి మధ్య వేపచెట్టునూ వదిలేసి వేరుకుంపటి పెట్టుకుంటున్నాడు కళ్ళ ముందు కాసుల గలగలలు వినిపిస్తున్నా కళ్ళలో విస్తరిస్తున్న నైరాశ్యపు నీడల మధ్య అస్పష్టమైన రంగులతో ఇంధ్రధనుస్సు సౄష్టించుకోవాలనుకుంటున్నాడు పచ్చని నేలను కౌగిలించుకోలేనప్పుడు హృదయమెప్పుడూ ఎండిన బీడే ఎన్ని రంగులున్నా ఏటిపక్కన పూచే మందారపు ఎరుపేది? ఎన్ని రంగులున్నా పెరటి ముద్దబంతి పసుపేది? వేపపూత ఆకుపచ్చేది? నిద్రగన్నేరు పూల రంగేది? అన్నీ సింధటిక్ రంగులు రాత బల్ల మీద అమర్చిన కాగితప్పూల వెలిసిపొయిన రంగులు ఈ రంగులు రాగాలు వినిపించలేవు ఈ రంగులు ఆశలను చిగురింపలేవు ఈ రంగులు జీవితాన్నివెలిగించలేవు ఈ రంగుల్తో ఇంధ్రధనుస్సును సృష్టించలేము - మల్లవరపు ప్రభాకరరావు ...

నక్కల వాగు

ఎన్నెల్లో సెందురుడు సుక్కలెలుగులు పిల్లగాలి పలకరింపుల కలలేటికి తండ్రీ! చెమట చుక్కల్ని గంజిమెతుకులుగా మార్చుకోవడానికి గానుగెద్దులైటోల్లకి బువ్వ దొరకటమే పంచనచ్చత్తరాల కల అప్పుడెప్పుడో అయ్య చేసిన అప్పుకు ఆదీ లేదు అంతం లేదు అంగిలెండిన చంటోడికి అమ్మ ఆకలి తెలీదు వయసొచ్చిన పిల్లమానం సుబ్బులప్ప కోకను వోణీ గుడ్డలుగా చేసింది అచ్చరం ముక్క లేదు అంగుళం భూమి లేదు మా ఆడోళ్ళనాగం చేయడానికి ఆసామిగోరి పొలాలు ఆడ్నించి ఈడికి నడుము నిలవనంటున్నా బిచ్చాలు తాత పొగమొక్కలకి పోతానంటాడు ఏందియా బో వొగుసోడిలా కావిళ్ళకు పోతుండావంటే ఊరికే కూకుంటే ముద్దేడినించొత్తాదిరా అనెటోడు మెతుకుకు మూరెడు దూరం బతుకులు అంగిట్లో ముద్దకోసమే బతుకంతా యాగీ ఆకలి పోరాటంలో అలసి నక్కలోగుకి పోయినప్పుడు లచ్చుమవ్వ ఏరై పొంగింది వాగొడ్డున నిలేసుకున్న తుమ్మ చెట్లు మాత్రం ఇదంతా మామూలే అన్నట్లు తలలాడిస్తున్నాయి -మల్లవరపు ప్రభాకరరావు (1998)

పాతకాలపు మనిషి

వర్తమానం బరువెక్కినప్పుడు ఙ్ఞాపకాల్ని తడుముకోవడమే మిగిలింది అస్తమానమూ అసమానతలు గురించి గొంత్తెత్తిమాట్లాడే కోడలుకు అత్త అసహాయత మాత్రం అలుసవుతుంది తన కడుపు కాల్చుకుని వెలిగించిన బిడ్డ తందాన వంతగాడయ్యాడు అయినా మన బంగారం మంచిదవాలిగా- అమ్మ ఇప్పుడొక అక్కర్లేని అవశేషం తొలగించుకోవడానికి వెయ్యిన్నొక్కసార్లు నొసలు చిట్లించడం మనసు ముక్కలవడానికి మాటలే ఈటెలు నిజమే తండ్రీ! అడ్డాలనాడు బిడ్డలుగానీ గడ్డాలనాడా ఆదరాబాదరగ ఆకలి తీర్చాలని ఊదునుగొట్టంతో ఊపిరి చివరిదాకా ఊది పొయ్యి కింది పిల్లిని తోలిన అమ్మ ఊపిరి తీసుకోవడానికిప్పుడు మాటలే కరువు పచ్చి పుండై పొలాన్నించి వచ్చి పిల్లాడి నవ్వు కోసం పేదరాసి పెద్దమ్మ కధల్ని సృష్టించిన అమ్మకు పచ్చ నోట్ల మోహంలో మునిగిన తనయుని తన్మయత్వం ఒక వింతే! అమ్మకు కావల్సింది మాటల మబ్బులే కాని ఎడారి నిశ్శబ్దం కాదు రచ్చబండ మీద,చేలగట్లపైన,చెరువుకట్ట మీద ఊరి పలకరింపులో తడిసిన అమ్మ ఈ విశాల గదుల మధ్య ఇరుకు హృదయాల వాస్తవాన్ని అంగీకరించలేకపోతున్న చాదస్తురాలే! పేదరికం బరువు కాలేదు ఇంటి మగోడి చావు దుఖం కల్గించలేదు అన్నింటికీ మించి బ్రతుకులో ఆశ చావలేదు కానీ కుంచించుకు పోతున్న కుమారుని హృదయా...

అదొక అందమైన నిరీక్షణ

విరహమంటే దుక్ఖం కాదు అదొక విరామం జ్ఞాపకాల్ని తలపోసుకోడానికి కాసింత ఏకాంతం బాల్కనీలో కూర్చొని సన్నగా వినిపించే గజల్ మాధుర్యాన్ని వెన్నెల సోయగాన్ని రెండు హ్రుదయాలు మౌనంగా ఆస్వాదించడం మౌనాన్నే సంభాషణగా మార్చుకోవడం కొబ్బరాకుల కిటికీ చువ్వల్లోంచి చందమామను పిలిచే తుంటరితనం పిల్లతెమ్మెర గుసగుసలలొ రహస్యాన్ని పంచుకోవడం ప్రియురాలు ఆదమరిచి నిద్రిస్తున్నప్ప్పుడు చేతితో సుతారంగా ముంగురులు సవరించడం తెలిసీ తెలవని పలవరింతలు అలలు అలలుగా జ్ఞాపకాల్ని వెంట తెచ్చే అనుభూతి సముద్రం అవును విరహమంటే శోకం కాదు ఎడారిలో చంద్రోదయాన్ని వీక్షించడం మధురానుభూతుల్ని ప్రియంగా చుంబించడం ప్రియురాలి చిర్నవ్వు మెరుపులో మరొక్కసారి తళుక్కుమనడానికి ఎదురు చూడడం జీవితం చివరికంటా మిగుల్చుకోడానికి కాసింత పరిమళాన్ని పొదువుకోవడం విరహమంటే అగాధలోయల్లోకి విసిరేయబడ్డం కాదు కాస్సేపు జ్ఞాపకాల వీధుల్లో ఊరేగడం సరోద్ తంత్రుల సన్నని నాదాన్ని ప్రియురాలి సోగకళ్ళ చిలిపిదనాన్ని జుగల్బందీగా వీక్షించడం విరహమంటే నిద్రకూ మెలుకువకూ మధ్య మంచి కలగనడం విరహమంటే... అదొక అందమైన నిరీక్షణ మల్లవరపు ప్రభాకరరావు(2002)